శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నాన్ని అడ్డుకున్న సైబరాబాద్ పోలీసులు
నిందితులను శిక్షించాలంటున్న ప్రజలు
హత్యారాజకీయాలకు చోటులేదు : విప్ గువ్వల
దుర్మార్గమైన చర్య : ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మహబూబ్‌నగర్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమ సమయంలో ఉద్యోగులందరినీ ఏకం చేసి, తెలంగాణ సాధనలో చురుకైన పాత్ర పోషించిన నేత, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర జరిగింది. జిల్లాను అన్ని రంగాల్లో ప్రగతి పథాన నడిపిస్తున్న అభివృద్ధి ప్రదాతపై కొందరు కుట్రతో హత్యాయత్నానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన సైబరాబాద్ పోలీసులు కుట్రను ఛేదించారు. రాజకీయ విభేదాలే కాకుండా.. భవిష్యత్తులో పాలమూరు రాజకీయాల్లో చోటు ఉండదని భావించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ కుట్రను ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ విప్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఖండించారు. తెలంగాణలో హత్యా జకీయాలకు చోటు లేదని వారు హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులను ఏ కం చేసి.., రాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించిన ఉద్యమ నేత, బీసీ నాయకుడైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాయత్నం చేశారనే వార్త ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వాసులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. తెలంగాణ ఉద్యమంలో సమైక్య పాలకుల అణచివేతను ఎదుర్కొంటూ పోరాటం చేసిన శ్రీనివాస్‌గౌడ్ 2014లో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత పాలమూరు రూపురేఖలు మార్చేశారు. దీంతో రెండోసారి ఎమ్మెల్యేగా ఘనమైన మెజార్టీతో గెలుపొందారు. శ్రీనివాస్‌గౌడ్ పనితీరును మెచ్చుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రిగా అవకాశం కల్పించారు. మంత్రి అయ్యాక నియోజకవర్గం రూపురేఖలు మారిపోయేలా పనిచేశారు.
అన్ని రంగాల్లోనూ పాలమూరును అభివృద్ధి పథాన తీసుకెళ్తున్నారు. ఇంతటి అభివృద్ధి ప్రదాతపై కొందరు కుట్రపన్ని హత్యాయత్నం చేశారు. రాజకీయ విభేదాలే కాకుండా.. భవిష్యత్‌లో తమకు మహబూబ్‌నగర్ రాజకీయాల్లో చోటు ఉండదని భావించి హత్యాయత్నానికి కుట్ర పన్నారు. ప్రతిపక్ష నేతల సహకారంతోనే హత్యకు కుట్ర జరిగినట్లు మహబూబ్‌నగర్ ప్రజలు భావిస్తున్నారు. మంత్రిపై హత్యకు కుట్రపన్నిన వారిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి వివరాలు వెల్లడించడంతో స్థానికంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. అభివృద్ధి ప్రదాతపై హత్యకు కుట్ర పన్నిన తీరును స్థానికులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పాలమూరులో హత్య రాజకీయాలకు చోటు లేదని కుట్రపన్నిన, సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కుట్ర వెనుక ఎంతటి స్థాయి వ్యక్తులున్నా అరెస్టు చేసి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
తీవ్రంగా పరిగణించాలి..
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాత్ర ఎంతో ఉన్నది. స్వరాష్ట్ర సాధన తర్వాత ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న నేత ఆయన. మా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చి మంత్రిగా పని చేస్తున్నందుకు గర్వంగా ఉన్నది. పాలమూరు పునర్నిర్మాణం కోసం పనిచేస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యకు కుట్ర చేయడం ఆందోళన కలిగించే విషయం. ఈ ఘటనను ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించాలి. ఇందులో ఎంతటి వారున్నా వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఉద్యోగ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం.
ప్రజల మధ్య ఉండే నేతపై కుట్రలా..
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తి. నియోజకవర్గ ప్రజల సమస్యలపై నిత్యం స్పందిస్తాడు. మంత్రిగా రాష్ట్ర బాధ్యతలు, ఎమ్మెల్యేగా నియోజకవర్గ బాధ్యతలు రెండింటినీ సమాన స్థాయిలో నిర్వహిస్తుంటాడు. అభివృద్ధి, సంక్షేమం తప్పా వేరే విషయాలు పట్టని మంత్రిపై కూడా కుట్రలు పన్నారు. ఆయన హత్యకు ప్రణాళిక రచించారని తెలిసి ఆందోళనకు గురయ్యాం. ముమ్మాటికీ ఇది పిరికిపందల చర్య. అందరూ దీన్ని ముక్తకంఠంతో ఖండించాలి. ఈ ఘటన వెనుక ఎంతటి వారున్నా కఠినంగా శిక్షించాలి.
– పట్నం నరేందర్ రెడ్డి, కొడంగల్ ఎమ్మెల్యే
హత్యా రాజకీయాలకు చోటు లేదు..
హత్యా రాజకీయాలకు తెలంగాణలో చోటు లేదు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్ అభివృద్ధి పథాన నడిపిస్తున్నాడు. మంత్రిగా నియోజకవర్గం రూపురేఖలు మార్చేశారు. ముఖ్యమంత్రితో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, మృదుస్వభావిగా పేరుంది. వ్యక్తిగతంగా, రాజకీయంగా ఆయన అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు కుట్ర పన్నుతున్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించం. కుట్రకు బాధ్యులుగా తేలితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు.
– గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు
ఇలాంటి ఘటనలు సహించం..
తెలంగాణ.. దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా వెలుగొందుతున్నది. ఎనిమిది ఏండ్లలో ఊహించని విధంగా అభివృద్ధి జరిగింది. రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలకు చోటు లేదు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది అత్యంత దుర్మార్గమైన, పిరికిపందల చర్య. అలాంటి ఆలోచన చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఈ ఘటనలో ఎంతటి వారున్నా వదిలి పెట్టకూడదు. భవిష్యత్‌లో ఇలాంటి ఆలోచన చేయకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. సీఎం కేసీఆర్ పాలనలో ఇలాంటివి సహించే ప్రసక్తే లేదు.
– ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే
ఇది దుర్మార్గమైన చర్య..
మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యకు కుట్ర చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య. తెలంగాణలో హత్య రాజకీయాలకు చోటే లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు సమాజానికి ఏ మాత్రం మంచి చేయవు. హత్యా రాజకీయాలకు రాష్ట్రంలో చోటులేదు.
– డాక్టర్ సి.లక్ష్మారెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు