పురుషులు కూడా భయపడే ఉద్యోగాల్లో అతివలు
క్లిష్టమైన బాధ్యతల్లో అలవోకగా విధులు
తెలంగాణలో తొలి ట్రాన్స్ కో జూనియర్ లైన్ ఉమెన్లు
ఉద్యోగంలో రాణిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్న నారీమణులు
మహబూబ్‌నగర్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : విద్యుత్ శాఖలో జూనియర్ లైన్మెన్లుగా మహిళలు సైతం రాణిస్తూ తామెవరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు. 20అడుగుల విద్యుత్ స్తంభాలు, 400కేవీ సబ్ స్టేషన్లో 40అడుగుల ఎత్తు ఎక్కి అలవోకగా మరమ్మతులు చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఈ వృత్తిని స్వీకరించేందుకు పురుషులు సైతం జంకుతారు.. అయితే తెలంగాణలో తొలిసారిగా సుమారు 300మంది మహిళలు జూనియర్ లైన్ ఉమెన్లుగా కఠినమైన వృత్తిలోనూ రాణిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కోనేటిపురం వద్ద ఉన్న 400కేవీ సబ్ స్టేషన్లో జూనియర్ లైన్ ఉమెన్లుగా పనిచేస్తున్న ఐదుగురు మహిళలు తమ ప్రత్యేకతను చాటుతున్నారు.
విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ఉమెన్లుగా రాణిస్తూ తామెవరికీ తీసిపోమని నిరూపిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా కనీసం 20 అడుగుల ఎత్తు ఉన్న విద్యుత్ స్తంభాల ను, 400 కేవీ సబ్‌స్టేషన్‌లో సుమారు 40 అడుగుల ఎత్తు ఎక్కి అలవోకగా మరమ్మతులు చేస్తూ ఔ రా అనిపిస్తున్నారు. 400 కేవీ సబ్స్టేషన్లలో పని అంటేనే కఠోర శారీరక శ్రమతో పాటు ప్రమాదకరమైన బాధ్యతలూ ఉంటాయి. అందుకే ఈ వృత్తి చేసేందుకు పురుషులూ ముందుకు రాకపోయేవారు. కానీ, తెలంగాణలో తొలిసారిగా సుమారు 300 మంది మ హిళలు జూనియర్ లైన్ఉమెన్లుగా రాణిస్తున్నారు. నాగర్క ర్నూల్ జిల్లా వంగూరు మండలం కోనేటిపురం వద్ద ఉన్న 400 కేవీ సబ్‌స్టేషన్‌లో జూనియర్ లైన్ఉమెన్లుగా ఐదుగురు మహిళలు పనిచేస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. పురుషులతో సమానంగా విధులు నిర్వర్తిస్తామని నిరూపిస్తున్నారు.
సవాల్‌గా స్వీకరిస్తూ..
400 కేవీ సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తించేందుకు అవకాశం రావడంతో జూనియర్ లైన్ఉమెన్లు విధుల్లో చేరారు. అక్కడ పనిచేసెటోళ్లు వీరిని చూసి ఇక్కడ పనిచేయడం అంత ఈజీ కాదనే భావనలో ఉన్నారు. ‘ఇదసలే కరెంట్ పని.. మీవల్ల సాధ్యం కాదు.. ఎత్తైన విద్యుత్ టవర్లు ఎక్కాలి.. ఎండ, వా న, చలిలోనూ సమస్యలు తలెత్తకుండా పనిచేయాలి.. మీ వల్ల ఏమవుతుంది’ అన్నవాళ్లంతా ఆశ్చర్యపోయేలా పనిచేస్తున్నారు. ఇరుగుపొరుగు వారి సూటిపోటి మాటలను సవాలు గా స్వీకరిస్తూ ప్రమాదకరమైన వృత్తిలోనూ రాణిస్తున్నారు. కోనేటిపురం 400 కేవీ సబ్‌స్టేషన్ పరిధిలో గతేడాది అక్టోబర్‌లో శివలీల, నసీమ్ బేగం, స్వప్న, సునీత, నందిని విధు ల్లో చేరారు. పురుషుల కంటే తక్కువ కాదని నిరూపిస్తున్నారు.
ట్రాన్స్‌కో చరిత్రలో తొలిసారిగా..
నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించే రాత ప రీక్ష లో అర్హత సాధించిన అభ్యర్థులకు విద్యుత్‌స్తంభాలు, టవర్లు ఎక్కడంలో ఉన్న నైపుణ్యాన్ని పరీక్షించేందుకు శారీరక పరీక్షనూ నిర్వహిస్తారు. పోల్ ైక్లెంబింగ్ పరీక్షలో విజయం సాధించిన అభ్యర్థులను జేఎల్ఎం పోస్టులకు అర్హులుగా పరిగణిస్తారు. జేఎల్ఎం పోస్టుల భర్తీలో మహిళా అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో వారికి కూడా అవకాశం లభించింది. ప్రమాదకరమైన వృత్తి మీకేందుకు అన్న నేటి సమాజంలోని వింత పోకడలను పట్టుదలతో అధిగమించారు. ట్రాన్స్‌కో చరిత్రలో తొలిసారిగా జూనియర్ లైన్ఉమెన్ ఉద్యోగం సాధించారు. అంతరిక్షంలోకి దూసుకెళ్లిన మ హిళలు కరెంట్ స్తంభాలు కూడా ఎక్కగలరని నిరూపించారు. పురుషులకే పరిమితమైన కరెంట్ ఉద్యోగాలు సాధించడం అంత తేలికైన పనేం కాదు. మొదట్లో మహిళలేం చేస్తారంటూ కొందరు ఎన్నో విమర్శలు చేశారు. ఆటంకాలు ఎదురైనా కష్టపడి విజయం సాధించారు.
అంత ఈజీ కాదు..
400 కేవీ సబ్‌స్టేషన్‌లో సుమారు 40 అడుగుల ఎత్తు ఉన్న బ్రేకర్పైకి ఎక్కడం అంత ఈజీ కాదని ట్రాన్స్‌కోకు చెందిన ఓ సీనియర్ ఇంజినీర్ తెలిపారు. మరమ్మతులు చే యాల్సి వచ్చినప్పుడు, నిర్వహణ పనుల కోసం అంత ఎత్తు ఎక్కాల్సి ఉంటుంది. పురుష ఉద్యోగులే పై నుంచి కింద పడి అనేక మంది ప్రమాదాల బారిన పడ్డారు. అలాంటి క్లిష్టమైన ఉద్యోగ బాధ్యతల్లో మహిళలు విజయవంతంగా పనిచేయ డం గొప్ప విషయంగా చెబుతున్నారు. ఇన్సులేటర్ల మీద కా లు పెడుతూ పైకి ఎక్కడం చాలా కష్టంగా ఉంటుందని.. కొం చెం పట్టుతప్పినా పై నుంచి పడితే ఎముకలు విరిగే ప్రమాదముందంటున్నారు. అయినా.. స్పెషల్ మెయింటనెన్స్ గ్యాంగ్‌లోని ఈ ఐదుగురు మహిళల పనితీరు కూడా అద్భుతంగా ఉందని అధికారులు కితాబునివ్వడం గమనార్హం.
అభినందించక తప్పదు..
విద్యుత్ శాఖలో ఎప్పటి నుంచో ఉన్న పోస్టు పేరు లైన్మెన్. విద్యుత్ స్తంభాలపైకి ఎక్కి సాంకేతిక సమస్యలను పరిష్కరించే మగవాళ్లే అందరికీ తెలుసు. ఇక మీదట ఆ పదాన్ని లైన్ పర్సన్ అనాలో లేక పురుషులకు లైన్మెన్ అని, మహిళలకు లైన్ ఉమెన్ అని మారుస్తారో చూడాలి. అంతర్జాతీయ క్రికెట్లోనూ మహిళా క్రికెటర్లు రాణించాక.. పురుషులకే పరిమితమైన బ్యాట్స్‌మెన్ పదానికి కాలం చెల్లింది. బ్యాటింగ్ చేసే వారిని బ్యాటర్ అని పిలుస్తున్నారు. అలాగే కరెంట్ శాఖలో కూడా ఇకపై లైన్మెన్ పేరు మార్చక తప్పని పరిస్థితి వచ్చేసింది. పురుషాధిక్య కేడర్‌పై తిరుగులేని విజయం సాధిస్తుండడంతో లైన్ఉమెన్లను అభినందించ తప్పదు.
చాలా కష్టాలు పడ్డాను..
మా నాన్న ఆశయం మేరకు నా భర్త సహకారంతో ఐటీఐ పూర్తి చేశాను. రూ.2వేల వేతనంతో ప్రైవేటు ఉద్యోగాలు చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చాను. ప్రభుత్వ ఉద్యోగం చేయాలని మా నాన్న ఎంతో ఆశపడేవారు. ఇప్పుడు ఆయన కోరిక నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రైవేటులో ఎంత కష్టపడినా కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు. ప్రైవేటు స్కూళ్లలో రోజంతా చాకిరీ చేసినా తక్కువ వేతనాలు ఇచ్చేవారు. నా భార్త, పిల్లలు, కుటుంబ సభ్యులు అంతా సంతోషిస్తున్నారు. నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని అందరూ గర్వంగా చెబుతున్నారు.
– నసీమ్ బేగం, హైదరాబాద్
2 నిమిషాల్లో టవర్ ఎక్కాను..
అమ్మానాన్నకు మేం నలుగురు కాగా, నేను రెండో సం తానం. ఐదో తరగతిలో ఉన్నప్పుడే నాన్న అనారోగ్యంతో చనిపోయారు. అ మ్మ కూలి పనిచేసి మమ్మల్ని చదివించింది. నేను, అక్క ఇద్దరం ట్రాన్స్‌కో ఉ ద్యోగం కోసం ఎంతో కష్టపడి పోల్, టవర్ ఎక్కడం నేర్చుకున్నాం. 2 నిమిషాల్లో 80 మీటర్ల టవర్ ఎక్కుతాను. మొదట్లో చాలా ఇబ్బందిగా అనిపించే ది. కానీ బాధను భరిస్తూ కష్టపడి శ్రమించాను. తెలంగాణ ప్రభుత్వం కూడా అవకాశం కల్పించడంతో తొలిసారిగా ట్రాన్స్‌కో ఉద్యోగం సాధించాను. చా లా మంది మేం పనిచేయలేమని భావించారు. కానీ మేము ఎవరికీ తక్కువ కాదని నిరూపిస్తూ విజయవంతంగా విధులు నిర్వర్తిస్తున్నాం. మా అక్కకు కూడా ఇక్కడ ఉద్యోగం వచ్చినా.. టీచర్ జాబ్ రావడంతో అటువైపు వెళ్లింది. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవాలి. ఉద్యోగం చేసేందుకు మా కుటుంబ సభ్యులు సహకరించారు. టవర్ ఎక్కడం నేర్పించిన వెంకీ మాస్టర్, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– సునీత, జూనియర్ లైన్ఉమెన్, చిట్లంకుంట, పదర మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా
గర్వంగా ఉన్నది..
మాది అచ్చంపేట. మా తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. తమ్ముడు ఎనిమిదేండ్ల కిందట మరణించాడు. ఆడపిల్లలం అయినా.. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా.. ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేని విధంగా మమ్మల్ని పెంచారు. గురుకులంలో చదువుకున్నాం. అక్కడ ఆటలు ఆడడంతో ఫిజికల్ ఫిట్నెస్ బాగుంది. ట్రాన్స్‌కో జూనియర్ లైన్ ఉమెన్‌గా ఎంపికయ్యేందుకు ఈ ఫిట్నెస్ ఎంతగానో ఉపయోగపడింది. చిన్నప్పటి నుంచి ధైర్యంగా పెరగడంతో ఏదైనా సాధిస్తాననే నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకంతోనే పురుషులు సైతం ఎత్తైన భారీ విద్యుత్ టవర్లు ఎక్కేందుకు భయపడే ఉద్యోగం చేసేందుకు ముందుకు వచ్చాను. విజయం సాధించాను. నాకు ఉద్యోగం రావడంతో కుటుంబానికి ఆసరా లభించింది. అమ్మానాన్న ఎంతో సంతోషపడుతున్నారు. అది చూసి నాకు ఎంతో గర్వంగా ఉన్నది. మహిళలు కూడా ఏ విధులైనా నిర్వర్తించొచ్చని నేను నిరూపిస్తున్నాను. అయితే, పట్టుదల, ఏకాగ్రత, శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా ఉంటే మా ఉద్యోగం చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ రంగంలోకి రావాలనుకునే మహిళలు ధైర్యంగా అడుగువేయాలి.
– ఎం.నందిని, జూనియర్ లైన్ఉమెన్, 400 కేవీ సబ్‌స్టేషన్, కోనేటిపురం,
నాగర్‌కర్నూల్ జిల్లా