మన ఊరు-మన బడి’, మన బస్తీ-మన బడి’తో మారనున్న రూపురేఖలు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నల్లమల అప్పర్ప్లాట్లో సాగునీరు పారిస్తాం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
సీఎం కేసీఆర్ గొప్ప వ్యక్తి : ఎంపీ రాములు
అచ్చంపేట, ఫిబ్రవరి 25: ప్రపంచాన్ని మార్చే శక్తి విద్యకు మాత్రమే ఉన్నదని నెల్సన్ మండేలా చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకున్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం అమ్రాబాద్‌లో రూ.2.5కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కలెక్టర్ ఉదయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో మన ఊరు-మనబడి, మన బస్తీ- మన బడిపై నిర్వహించిన అవగాహన సమావేశంలో మంత్రి మాట్లాడారు. విద్యతోనే సమాజంలో మార్పు వస్తుందన్నారు. ప్రతి విద్యార్థిలో ఏదో ఒక నైపుణ్యం దాగి ఉంటుందని, ప్రతిభను గుర్తించి ప్రాధాన్యత కల్పిస్తే ఉన్నతస్థాయిలో రాణిస్తారన్నారు. కార్పొరేట్‌కు దీటుగా అన్ని సౌకర్యాలతో సర్కారు బడులను తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు-మన బడి, మనబస్తీ- మనబడి కార్యక్రమాన్ని రూపొందించారన్నారు. ఈ పథకానికి రూ.7వేల కోట్లు కేటాయించారన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 825 ప్రభుత్వ పాఠశాలకుగానూ 294 బడులను మొదటి విడుతగా ఎంచుకొని 12రకాల సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అచ్చంపేట నియోజకవర్గంలో 94పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. అదేవిధంగా మహిళల కోసం సీఎం కేసీఆర్ యూనివర్సిటీ మంజూరు చేయడం గొప్ప పరిణామమన్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చదివించేందుకు ఆసక్తి కనబరుస్తున్నందున వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఆంగ్లబోధన ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. డిగ్రీ కళాశాల భవనానికి స్థలం విరాళంగా ఇచ్చిన అర్చకుడు వీరయ్య దంపతులు, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తనవంతు కృషిచేస్తున్న నర్సింగ్రావును సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సీఎం కేసీఆర్‌పై ఒత్తిడి తెచ్చి అచ్చంపేట సాగునీటి పథకాన్ని సాధించారన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు.
లింగాల, చారకొండలో జూనియర్ కళాశాల, అచ్చంపేటలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేసేందుకు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. అదేవిధంగా ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ నల్లమల ప్రాంతం వెనుకబడిన ప్రాంతం కాకుండా అన్నిరంగాల్లో ముందుందన్నారు. విద్య గొప్ప ధనం లాంటిదన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు గువ్వల బాలరాజు మాట్లాడుతూ అమ్రాబాద్‌లో రూ.2.50కోట్లతో డిగ్రీ కళాశాల భవనాన్ని ప్రారంభించుకునేందుకు మూడుసార్లు ప్రయత్నం చేసినా కరోనా వల్ల వాయిదా పడిందన్నారు. ఈ గడ్డరుణం తీర్చుకునేందుకు కృష్ణమ్మను తీసుకొచ్చి అప్పర్‌ప్లాట్ నేలపై పారిస్తానన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటామని చెప్పే ప్రతిపక్షాలు తీరు మార్చుకోవాలని హితవు పలికారు. రాయలగండి చెన్నకేశవస్వామి రిజర్వాయర్‌లో భాగంగా సాగునీటికి సర్వే చేస్తుంటే అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేక్కడి చిల్లర రాజకీయమని ప్రశ్నించారు. అనంతరం ఎంపీ రాములు మాట్లాడుతూ నల్లమల శివపార్వతులు నడియాడిన గడ్డ అని, ఈ ప్రాంతంలో విద్యాశాఖ మంత్రి చేతులమీదుగా డిగ్రీ కళాశాల ప్రారంభించుకోవడం సంతోషకరమన్నారు. దేశానికి ఆదర్శంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తున్న సీఎం కేసీఆర్ గొప్ప వ్యక్తి అని కొనియాడారు.
విద్యకు ఎన్ని నిధులిస్తే అంత లాభమని, విద్యతో దేన్నైనా మార్చవచ్చన్నారు. జీవో 317 ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న కొంతమంది ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారని, వారు కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారని, అలాంటి వారికి తిరిగి ఇదే ప్రాంతానికి బది లీ చేయాల్సిందిగా మంత్రిని కోరారు. లింగాల, చారకొండ మండలాల్లో జూనియర్ కళాశాలలు నెలకొల్పాలని, అచ్చంపేటలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలని వినతిపత్రం అందజేశారు. విద్యార్థుల సాం స్కృతిక నృత్యాలు, ఉపన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా, డీఈవో గోవిందరాజులు, ఆర్డీవో పాండునాయక్, సర్పంచ్ శారద, మార్కెట్ చైర్మ న్ సీఎంరెడ్డి, జెడ్పీటీసీ రాంబాబు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.