ఆరేండ్ల కిందట ఇంగ్లిష్ మీడియం
17 పెరిగిన విద్యార్థుల సంఖ్య
పాఠశాలలో వెయ్యిమొక్కల సంరక్షణ
‘మన ఊరు-మన బడి’తో మరిన్ని మౌలిక వసతులు
తిమ్మాజిపల్లెవాసుల తీర్మానం
వడ్డేపల్లి, ఫిబ్రవరి 28 : తిమ్మాజిపల్లె.. అక్కడ ఎక్కువ శాతం నిరక్షరాస్యులే..గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 17 మంది విద్యార్థులే ఉండడంతో మూసివేసే పరిస్థితి నెలకొన్నది. గ్రామస్తుల సహకారం, సర్కారు చేయూత నివ్వడంతో ఆరేండ్ల కిందట ఇంగ్లిష్ మీడియం ప్రారంభించడంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. గ్రామస్తులంతా కలిసి ప్రైవేట్ బడికి పిల్లలను పంపమని తీర్మానం చేశారు. ప్రస్తుతం పాఠశాలలో 154 మంది విద్యార్థులున్నారు. ‘మన ఊరు-మన బడి’తో మరిన్ని మౌలిక వసతులు సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఆ గ్రామంలో ఎక్కువ శాతం నిరక్షరాస్యులే. జోగుళాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో 600 జనాభా ఉన్న మారుమూల గ్రామం తిమ్మాజిపల్లె. తమ గ్రామంలో విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ బడికి వెళ్లేలా తీర్మానించారు. పాఠశాలలో ఆరేండ్ల కిందట ఇంగ్లిష్ మీడియం ప్రారంభించారు. 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉండగా 6, 7వ తరగతుల కో సం పక్క గ్రామానికి నడిచి వెళ్లే దుస్థితి ఉండేది. గతంలో ఆం గ్ల మాధ్యమంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు ప్రైవేట్ బడులకు వెళ్లడానికి స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చేది. రవాణా, పుస్తకాలు, ప్రైవేట్ చార్జీలు భరించి అప్పుల పాలయ్యేవారు. గ్రామంలో ఉన్నత విద్యనభ్యసించిన కొందరు యువకులు సర్కారు బడిని అభివృద్ధి చేసేలా ప్రణాళికతో ముందుకెళ్లారు. గ్రామానికి ఉపకారం చేయాలని సంకల్పించారు. అదే సంకల్పంతో కృషిచేసి విజయం సాధించారు.
ప్రభుత్వ బడిలోనే ఇంగ్లిష్ మీడియం
గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రా రంభించాలని యువత సంకల్పించి గ్రామపెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి చర్చించారు. అందరి సహకారంతో గ్రామంలో ప్రైవేట్ బడులకు వెళ్లకుండా తీర్మానించారు. ప్రైవేట్ పాఠశాలల బస్సులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో దాతలు, గ్రామస్తుల స హకారంతో నాలుగెకరాల స్థలం చదును చేశారు. నిరూపయోగంగా ఉన్న పాఠశాల తరగతి గదులకు మరమ్మతులు చేయించారు. పాఠశాల ఆవరణలో వెయ్యి మొక్కలు నాటించడం, తాగునీటి సౌకర్యం కల్పించుకున్నారు. ఆంగ్ల మాధ్యమానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొ రత ఉన్నందున గ్రామంలోని ఐదుగురు నిరుద్యోగులు వలంటీర్లుగా బోధించడానికి ముందుకొచ్చారు.
గ్రామస్తుల సహకారంతో వలంటీర్లకు వేతనాలు అందిస్తున్నారు. దాతల సహకారంతో విద్యార్థులకు పుస్తకాలు, నోటుబుక్కులు, దుస్తులు, బెంచీలు కొనుగోలు చేసి పాఠశాలలో సౌకర్యాలను సమకూర్చారు. ఏటా ఉచితంగా గురుకుల కోచింగ్ ఇవ్వడంతో 10, 15 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలకు ఎంపికవుతున్నారు. జిల్లాలోనే మొట్ట మొదటిసారిగా గ్రామంలో చైతన్యం వచ్చి ప్రైవేట్‌ను బహిష్కరించి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిషు మీడియం ఏర్పాటు చేసుకున్నారు. ఆరేండ్లుగా పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం విజయవంతం చేయడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు యువతను అభినందిస్తున్నారు.
దాతల సహకారం
డిజిటల్ ఎడ్యుకేషన్ కోసం గురురాజారావు ఆచార్యు లు, రోటరీక్లబ్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ వారు బేంచీ లు, ఏటా నోట్ పుస్తకాలను విరాళంగా అందిస్తున్నారు. సీఐ వెంకటేశ్వర్లు స్మార్ట్ ఎడ్యుకేషన్‌కు సహకారం అందించారు. టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ద్వారా ఇంగ్లిష్ నేర్పించడానికి సామగ్రితోపాటు ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మౌలిక వసతుల కోసం రూ.లక్ష అందజేశారు. ఎంవీ ఫౌండేషన్ వారు విద్యార్థులకు బూట్లు, క్రీడలకు స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు.
విద్యార్థుల సంఖ్య పెరిగింది
ప్రభుత్వ పాఠశాలలో 17 మంది విద్యార్థులుం డి మూతబడే స్థితి నుంచి అదే సంవత్సరం 154 మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. మా పాఠశాల మాదిరిగానే అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధించేలా చూడాలని గతంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశాం. ఆంగ్ల మాధ్యమం ప్రారంభించి సక్సెస్‌గా నడుస్తున్నందున కలెక్టర్, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పరిశీలించి అభినందించారు.
– నాగేశ్‌యాదవ్, యువకుడు, తిమ్మాజిపల్లె
మా కల నెరవేరబోతున్నది
ప్రభుత్వమే సర్కారు బడుల్లో ఆంగ్లమాధ్యమం ఏర్పాటు చేయడం ద్వారా మా కల నెరవేరుతున్నది. ఆరేండ్ల కిందట ఇబ్బందులు పడి ఇంగ్లిష్ మీడియం ప్రారంభిం చాం. మన ఊరు-మన బడితో మరిన్ని సౌకర్యాలు సమకూరనున్నాయి. పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.8 లక్షలు మంజూరు చేసింది.
– వీరేశ్, యువకుడు, తిమ్మాజిపల్లె