ఇచ్చిన మాట తప్పని మహా నేత
హామీ మేరకు నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు
ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు
మెడికల్ కళాశాల ఏర్పాటు
పాలమూరు బస్తీబాటలో సీఎం కేసీఆర్ హామీలకు నిజరూపం
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఇచ్చిన మాట తప్పని మహా నేత.. ప్రజా సంక్షేమానికి కట్టుబడిన ప్రగతి సారథి సీఎం కేసీఆర్. 2015లో ఆయన పాలమూరు మురికి వాడల్లో పర్యటించారు. ఇరుకు సందులు.. చిన్న చిన్న గదులు చూసి గుండె బరువెక్కగా.. తాగునీటి సమస్యలను అక్కడి ప్రజలు సీఎం ముందు ఏకరువు పెట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని చూసి ఆయన చలించిపోయారు. అర్హులైన వారందరికీ డబుల్బెడ్రూం ఇండ్లు కట్టిస్తామని, ఇంటింటికీ శుద్ధజలం అందిస్తామని ప్రకటించారు.ఇచ్చిన హామీ మేరకు నేడు క్రిస్టియన్‌పల్లి, దివిటిపల్లి,వీరన్నపేటలో ‘డబుల్’ ఇండ్లు నిర్మించారు. మిషన్ భగీరథ జలాలు సరఫరా అవుతున్నాయి. అలాగే మెడికల్ కళాశాల ఏర్పాటైంది. కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతున్నది. తమ కష్టాలను దేవుడిలా వచ్చి తీర్చారని.. దటీజ్ కేసీఆర్ అంటూ స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జనవరి 18, 2015న ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ పాలమూరు పర్యటనకు వచ్చా రు. జిల్లా కేంద్రంలోని పాత పాలమూరు, వీరన్నపేట మురికి వాడల్లో పర్యటించారు. స్థానికులు త మ సమస్యలను సీఎం కేసీఆర్‌కు ఏకరువు పెట్టా రు. పెద్ద కుటుంబాలు చిన్న చిన్న ఇరుకు గదుల్లో ఉన్న పరిస్థితిని వివరించారు. నివాస సమస్యతోపాటు తాగునీటి ఇబ్బందులు కూడా గమనించా రు. ఇంటింటికీ తిరిగి సమస్యలను తెలుసుకొని చలించిపోయారు. సమైక్య రాష్ట్రంలో ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో ప్రత్యక్షంగా గమనించారు. పెద్ద పెద్ద కుటుంబాలు ఇంతటి ఇరుకైన ఇండ్లలో ఉండాల్సిన ఖర్మ ఎందుకని అర్హులైన వా రందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇస్తామ ని ప్రకటించారు. ఇంటింటికీ శుద్ధజలం అందించి తాగునీటి సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు.
నేడు..
సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నిరుపేదలకు ఇండ్లు కట్టించారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్ పల్లి, దివిటిపల్లి, వీరన్నపేటలో 1,994 ఇండ్లు నిర్మించారు. క్రిస్టియన్‌పల్లిలో డిసెంబర్ 4, 2017న గృహ ప్రవేశాలు జరిగాయి. జూలై 13, 2020న వీరన్నపేటలో, జూన్ 22, 2021న దివిటిపల్లిలో ఇండ్లు లబ్ధిదారులకు అందజేశారు. ఇంకా మహబూబ్‌నగర్ పట్టణంలో 1,556 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇప్పుడు లబ్ధిదారులు ఎంతో సంతోషంగా ఇండ్లలో నివాసముంటున్నారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లుగానే పట్టణానికే కాకుండా రాష్ట్రం మొత్తానికి మిషన్ భగీరథ శుద్ధజలం అందుతున్నది. ఇండ్లు లేక కష్టాలు పడిన తమకు సీఎం కేసీఆర్ దేవుడిలా వచ్చి ఆదుకున్నారని పేర్కొంటున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లతోపాటు మహబూబ్‌నగర్ పట్టణానికి హామీ ఇచ్చినట్లుగా ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా 2016లోనే ఏర్పాటైంది. వైద్యం కోసం పాలమూరు నుంచి పట్నం పోవాల్సిన పరిస్థితి లేదు. స్థానికంగానే సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతున్నది. ఇదంతా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది.
ప్రకృతి రమణీయత నడుమ..
చుట్టూ కొండలు, దట్టమైన అడవిని తలపించేలా ఏపుగా పెరిగిన వృక్షాలు, ఎటు చూసినా పచ్చదనం, ఉషోదయాన కొండలపై నుంచి వీచే చల్లని గాలి, పక్షుల కిలకిలారావాలు, నెమళ్ల నాట్యాలు, చెంగుచెంగుమని ఎగిరే జింకలు మనసును కనువిందు చేసే, ప్రకృతి పరవశింపజేసే ఎన్నో దృశ్యాలు. అలాంటి కొండలు, పచ్చందాల మధ్య నివసించాలని, ఉరుకులు పరుగుల జీవితాన ఇంటి వద్ద గడిపే కొద్దిపాటి సమయమైనా ప్రశాతంగా గడిపేయాలని ఎవరికైనా ఉంటుంది. అంతటి డ్రీమ్ హౌస్ కలలను మహబూబ్‌నగర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నెరవేస్తున్నాయి. వీరన్నపేట డబుల్ బెడ్రూం కాలనీ అయిన కేటీఆర్ నగర్ కూర్గ్, ఊటీని తలపిస్తున్నది.
అర్హులకు ఫలాలు..
మహబూబ్‌నగర్ పట్టణంలో వీరన్నపేట, పాతతోట ప్రాంతాలు చాలా వెనుకబడిన మురికి వాడలు. ఇక్కడి ప్రజలు సొంత ఇల్లు లేక, ఒకటే గదిలో తండ్రి, కొడుకులు, భార్య, పిల్లలు కలిసి జీవితం గడిపే పరిస్థితి ఉండేది. అపరిశుభ్రమైన వాతావరణంలో ఉన్న ఇళ్లు కూడా రేకుల షెడ్డును తలపించేవి. ఎండాకాలం వస్తే భయంకరమైన వేడిని భరించడం, వానకాలంలో పైకప్పులు సరిగా లేక వర్షపు నీటితో ఇల్లంతా బురదమయం.. ఇదీ పరిస్థితి. ఇక్కడి ప్రజలు సొంత ఇల్లు కట్టుకోలేక ఎన్నో బాధలను ఎదుర్కొంటూ జీవనం గడుపుతున్న సమయంలో 2015 జనవరి 18న ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబ్‌నగర్ సందర్శనలో భాగంగా వీరన్నపేట, పాతతోటను సందర్శించారు. అక్కడి ప్రజల పరిస్థితులను చూసి చలించి ఇండ్లు లేని నిరుపేదలందరికీ డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని హామీ చేశారు. అర్హులందరికీ ఇండ్లు ఇచ్చి వాగ్ధానాన్ని నెరవేర్చారు. దటీజ్ సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ వందేండ్లు బతకాలి..
‘నా పేరు లక్ష్మి. మా ఆయన పేరు రాములు. మాకు ఇద్దరు పిల్లలు. పదేండ్లుగా వీరన్నపేట పాతగేటు వద్ద కిరాయి ఉండేవాళ్లం. ఒకే రూమ్‌లో ఇద్దరు పిల్లలతో కష్టంగా గడిపాం. నా భర్త దివ్యాంగుడు. ప్రభుత్వం ద్వారా మాకు డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. అందులోనే చిన్న కిరాణా షాపు పెట్టుకున్నాం. కూరగాయలు కూడా అమ్ముతున్నాం. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మా పేదరికాన్ని గుర్తించి ఇల్లు వచ్చేలా చూశారు. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఇల్లు రావడం సంతోషంగా ఉన్నది. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలూ ఉన్నాయి. రోడ్లు, డ్రైనేజీ, మిషన్ భగీరథ నీరు, విద్యుత్ అన్నీ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి మా కుటుంబం జీవితాంతం రుణపడి ఉం టుంది. మాకు ఇల్లు ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ సార్‌కు కృతజ్ఞతలు. ఆయన వందేండ్లు సంతోషంగా బతకాలి. మాలాంటి ఎందరో పేదలకు న్యాయం జరుగుతుంది.’