తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగంలో టాప్
వనపర్తిని.. బంగారుపర్తిగా మార్చాలి
మున్సిపాలిటీలకు, పంచాయతీలకు నిధులు
ఉద్యోగులకు దేశంలో మెరుగైన సర్వీస్‌రూల్స్
కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కేసీఆర్
వనపర్తి, మార్చి 8 (నమస్తే తెలంగాణ): కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేయడం వల్లే రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే మొదటిస్థానంలో నిలబడిందని సీఎం కేసీఆర్ అన్నారు. రూ.51.70కోట్ల నిధులతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, కలెక్టర్ షేక్యాస్మిన్బాషాతో కలిసి సీఎం మంగళవారం ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో నూతన కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశమై సీఎం మాట్లాడారు. రాష్ట్రం వచ్చి ఎనిమిదేండ్లు అయ్యిందని, మనకన్నా ఏండ్ల నుంచి ఉన్న తమిళనాడు, గుజరాత్ తదితర రాష్ర్టాల తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, మౌలిక రంగా ల్లో వాళ్లకంటే ముందున్నామని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ వస్తే విద్యుత్ ఉండదని, తెలివిలేదని హేళన చేశారని, మనం ఏర్పాటు చేసుకున్న సమీకృత కలెక్టరేట్ భవనాలు, ఇతర రాష్ర్టాల్లో సెక్రెటేరియట్లు కూడా లేవన్నారు.
ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు ఇస్తున్న ఏకైక తెలంగాణ అని, 24గంటల విద్యుత్ అన్ని రంగాలకు ఇస్తున్నది దేశంలో మరో రాష్ట్రం లేదని తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు దాదాపు 13వేల మెగావాట్ల పైచిలుకు పీక్‌లోడ్ ఉంటే ప్రస్తుతం పది ఉమ్మడి జిల్లాల్లో 14 వేల మెగా వాట్ల పీక్‌లోడ్ ఉందని, దీన్ని బట్టి రాష్ట్రం విద్యుత్‌ను ఏ స్థాయిలో వినియోగించుకుంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. సాధించుకున్న రాష్ట్రం లో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. మన ఊరు-మన బడి కార్యక్రమానికి దాదాపు రూ.10వేల కోట్ల నిధులు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ఒకప్పుడు వలసలకు మారుపేరైన వనపర్తి ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి జరిగిందన్నారు. ఇక్కడితో ఆగిపోవద్దని, ఇంకా కష్టపడి మరింత అభివృద్ధి చేయాలన్నారు.
వనపర్తి.. బంగారుపర్తి కావాలి
వనపర్తిని బంగారుపర్తిగా మార్చాలని సీఎం పేర్కొన్నారు. రాబోయే కాలంలో సాగునీటి సమస్య పూర్తిగా తొలిగిపోతుందన్నారు. సీఎం ఫండ్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. సాధారణ నిధులకు అదనంగా వనపర్తి మున్సిపాలిటీకి కోటి రూపాయలు, ఇతర మున్సిపాలిటీలకు రూ.50లక్షలు, ఒక్కో గ్రామ పంచాయతీకీ రూ.20 లక్షలు చొప్పున మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం పెంచాలని సూచించారు, హరితహారం కింద పట్టణాలు,గ్రామాల్లో మొక్కలు పెంచాలని సూచించారు. రాష్ట్రంలో సర్వీస్ రూల్స్‌ను ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి అధ్యయనం చేసే విధంగా రూపొందిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగ విరమణ రోజు అతనికి అందాల్సిన అన్ని బెనిఫిట్లు చేతిలో పెట్టి ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద మర్యాదపూర్వకంగా దించిరావాలని సూచించారు.
ఉపాధ్యాయులకు లభించాల్సిన పదోన్నతులను కూడా త్వరలో ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నూతన సమీకృత కలెక్టర్ సముదాయాలను నిర్మించడం జరుగుతుందని, వనపర్తి జిల్లాలో 7వ కలెక్టరేట్ సముదాయాన్ని ప్రారంభించుకున్నామన్నారు. సీఎం ఆదేశాల మేరకు నెలలో 31వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి లభించనున్నదన్నారు. కొత్త నియామకాల్లో గద్వాల, వనపర్తి, ములుగు జిల్లాల్లో స్థానికులకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనుసరించి ఉద్యోగాలు వస్తాయన్నారు. సమావేశంలో ఎంపీలు రాములు, మన్నెం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్లు లోక్‌నాథ్‌రెడ్డి, సరిత, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆశీష్ సెంగ్వాన్, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి పాల్గొన్నారు.
మెడికల్, నర్సింగ్ కళాశాలలకు శంకుస్థాపన
వనపర్తి, మార్చి 8: జిల్లా కేంద్రంలో మెడికల్, నర్సింగ్ కళాశాలలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మంగళవారం జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో భాగంగా రూ.510 కోట్లతో 45ఎకరాల్లో నిర్మిస్తున్న 600పడకల మెడికల్ కళాశాల, రూ.29 కోట్లతో 5ఎకరాల్లో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు రాములు, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ యాస్మిన్‌బాషా పాల్గొన్నారు.