అయిజ: అక్రమ అరెస్టులతో ప్రజాపాలన కొనసాగించలేవని రేవంత్ సర్కారును బీఆర్ఎస్వీ (BRSV) జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య హెచ్చరించారు. శుక్రవారం అర్ధరాత్రి వేళ తనను అక్రమంగా అరెస్టు చేశారని చెప్పారు. అర్ధరాత్రి 12.26 గంటలకు హైదరాబాద్ నుంచి అయిజకు చేరుకున్నానని, క్షణాల్లోనే బీఆర్ఎస్ కార్యాలయానికి దొంగల్లాగా వచ్చిన పోలీసులు అరెస్టు చేసి అయిజ పోలీస్ స్టేషన్కు తరలించారన్నారు. రాత్రి మొత్తం అక్కడే ఉంచారని చెప్పారు. ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ పాలన అంటే అక్రమ అరెస్ట్ లేనా అని కాంగ్రెస్ సర్కార్ను నిలదీశారు. ప్రజాపాలనపై ప్రశ్నించే వారిని అక్రమ అరెస్టులు చేయడమే రేవంత్ ఎజెండాగా పెట్టుకున్నారని మండిపడ్డారు.
శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉండటంతో ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం సిగ్గుచేటన్నారు. ఏ చిన్న నిరసన కార్యక్రమం అయినా రేవంత్ సర్కార్ ఆగమాగం అవుతున్నదని చెప్పారు. అడుగడుగునా అక్రమ అరెస్టులతోనే సర్కారు సాగుతున్నదని మండిపడ్డారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు కేవలం 12,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు, కళాశాలల విద్యార్థులకు స్కాలర్ షిప్పులు, ఫీజు రియంబర్స్ మెంట్ నేటికీ విడుదల చేయలేదని అన్నారు.