జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన దంపతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం చేపల వేటకు వెళ్లిన వారికి గ్రామానికి చెందిన దుబ్బోనిబావి రాముడు (40)-సంధ్య(35) మృత దేహాలు కనిపించడంతో అధికారులకు సమాచారం అందజేసి ఒడ్డుకు తీసుకొచ్చారు. కాగా, వీరిద్దరూ మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో తాటికుంట రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లారు.
చేపల వేటకు వెళ్లిన దంపతులు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల ఎంత వెతికినా వారి ఆచూకీ కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన బంధువులు అధికారులకు సమాచారం అందించారు. గురువారం వారి మృతదేహాలు లభ్యమవడంతో గ్రామంలో విషాదం నెలకొంది.