గద్వాల, జనవరి 3:అభివృద్ధికి నడిగడ్డ అడ్డాగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైన నడిగడ్డ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అభివృద్ధి దిశగా అడుగులు వే స్తున్నది. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు కర్ణాటకకు సరిహద్దుగా ఉన్న నడిగడ్డపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృ ష్టి సారించడంతో అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా ఏర్పాటుతో రూపురేఖలు మారాయి. నడిగడ్డలో చేపడుతు న్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు సైతం నోరుమెదపని పరిస్థితి ఉంది. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా నడిగడ్డ మా రుతుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. –
రూ.15కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్
సాగునీరు పుష్కలంగా ఉన్న గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో రైతులు ఎక్కువగా కూరగాయల సాగుపై మొగ్గు చూపుతున్నారు. అయితే పండించిన కూరగాయలు అమ్ముకోవడానికి సరైన మార్కెట్ సౌకర్యం లేక రైతులు త క్కువ ధరకు దళారులకు విక్రయిస్తున్నారు. ఇది గ్రహించిన ప్రభుత్వం.. పండించిన కూరగాయలను రైతులు నేరుగా విక్రయించి ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డు ఆవరణలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. మార్కెట్‌ను నాలుగు బ్లాక్‌ల్లో నిర్మిస్తున్నారు. ఒక్కో బ్లాక్‌లో వెజిటేబుల్, సూపర్ మార్కెట్, చేపలమార్కెట్, ఫుడ్‌కోర్టు, పూలు, పండ్లు అమ్ముకునే వారికి ప్రత్యేకంగా దుకాణాలు నిర్మిస్తున్నారు. మార్కెట్ నిర్మాణం పూర్తయితే ప్రజలకు చౌకగా అన్ని ఒకేచోట దొరికే అవకాశం ఉండడంతోపాటు రైతులకు ఎంతో మేలు చేకూరనున్నది. అలాగే నల్లకుంటలో రూ.6.25కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నారు. ఇండర్ స్టేడియంతో సమావేశాలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సౌకర్యవంతంగా ఉండనున్నది. స్టేడియం పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇండోర్ గేమ్స్‌తోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఉపయోగపడేలా ఇండోర్ స్టేడియం నిర్మిస్తున్నారు.
పీజీ విద్యార్థులకు వసతిగృహాలు
జిల్లా కేంద్రానికి దూరంగా పీజీ కళాశాల ఉండడంతో విద్యార్థులు నానా అవస్థలు పడేవారు. ఇక్కడ వసతిగృహం లేకపోవడంతో పీజీ కళాశాలలో చేరేందుకు కొందరు ఇష్టపడేవారు కాదు. విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి.. విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. వసతిగృహాల నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరు చేశారు. ప్రస్తుతం రెండు వసతిగృహాలు అన్ని హంగులతో నిర్మించగా, నూతన కళాశాల భవనం, అదనపు వసతిగృహాల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. ఇవి అందుబాటులోకి వస్తే విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనున్నది.