
ఆరుతడి పంటలతో లాభాలు బాగు
నిరంతరం వరి సాగు చేస్తే దిగుబడి సమస్యలు
పప్పు, వాణిజ్య పంటల సాగుపై రైతన్న దృష్టి
జినేపల్లి, డిసెంబర్ 26: ఇతర పంటలు సాగు చేస్తే రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చని కేవీకే కో ఆర్డినేటర్ ప్రభాకర్‌రెడ్డి రైతులకు సూచించారు. నిరంతరం వరి సాగు వలన నేలలో భౌతిక సమస్యలు వస్తాయని నేలల యాజమాన్యంపై పలు సలహాలు అందించారు. తెలంగాణలో ప్రధానంగా మూడు రకాల నేలలున్నాయి. వీటిలో 48శాతం ఎర్రనేలలు, 25శాతం నల్లరేగడి నేలలు, 20శాతం ఒండ్రు నేలలు, మిగతా 7శాతం రాళ్లు, గుట్టలతో విస్తరించి ఉన్నాయి. ఎర్రనేలల్లో ఇసుక పాళ్లు ఎక్కువగా ఉండడం వల్ల తేలిక ప్రభావం కలిగి తేమను, పోషక పదార్థాలను నిలిపి ఉంచుకునే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఈ నేలలు వరిసాగుకు అనుకూలం కాదు. ఇప్పటికే 50శాతం ఎర్రనేలల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు. నిరంతరం వరి సాగు వల్ల అన్ని రకాల నేలల్లో భౌతిక, రసాయనిక సమస్యలు ఏర్పడి దిగుబడి తగ్గిపోతున్నది.
నిరంతరం వరిసాగు వల్ల సమస్యలు
ఎర్రనేలల్లో వరి సాగు వల్ల సన్నని ఇసుక , బంక మిన్ను ఉపరితలానికి చేరి నేల ఎరుపు రంగును కోల్పోయి నలుపు రంగుకు మారుతుంది. వరిసాగులో దుమ్ము చేయడం వల్ల అడుగు నేల బండబారిపోవడం జరుగుతుంది. దీర్ఘకాలిక నీరు ఆగి ఉండడం వల్ల లవణాల శాతం పెరిగి చౌడసమస్య తలెత్తుతుంది.
నీరు ఆగని తేలిక మెరిక భూములు కూడా అడుగున గట్టి పొర ఏర్పడడం వల్ల నీరు క్రుంగి పొరల్లోకి వెళ్లాక మురుగు నీటి సమస్య ఏర్పడుతుంది. ఉద్యాన, ఆరుతడి పంటలకు పనికి రాకుండా పోతుంది.
మాగాణిలో వరి తర్వాత ఆరుతడి పంటలకు అనువైన మంచి దుక్కి చేయడం ఓ ప్రధాన సమస్య. వరి తర్వాత ఆరుతడి పంటలు వేయడానికి నేలను దున్నగానే పెల్లాలు పెద్దవిగా తీస్తాయి. అందువల్ల వేసిన పైరు మొలకెత్తదు. వేర్ల పెరుగుదల, మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది.
నిరంతరం వరి సాగు వల్ల నేలల్లో సేంద్రీయకర్బనం, నత్రజని మోతాదు చాలా వరకు తగ్గుతుంది. సూక్ష్మజీవుల సంఖ్య తగ్గిపోయి సేంద్రియ ఎరువులు కుళ్లిపోవడం తగ్గుతుంది. వరిసాగు భూముల్లో గంధకం, జింక్ పోషకాల మోతాదు తగ్గిపోయి వరి పంట వేసిన తర్వాత పండించే ఆరుతడి పంటల్లో లోప లక్షణాలు ఎక్కువగా కన్పిస్తాయి.
నేలల యాజమాన్యం
నిరంతరం వరి సాగు వలన కలిగే సమస్యలను అధిగమించడానికి పంట మార్పిడే ప్రధాన ప్రత్యామ్నాయం. ఎర్ర నేలల్లో వరిసాగును తగ్గించి ఉద్యానవన పంటలైన జామ, బత్తాయి, మామిడి, ఆయిల్‌పామ్ లాంటి పంటలను పండించుకోవచ్చు. నీటి సామర్థ్యాన్ని బట్టి ఎర్ర నేలల్లో వేరుశనగ, కంది, మినుము, పెసర,జొన్న, ఆముదం, ఉలవలు, రాగులు సాగు చేసుకోవచ్చు.
నీరు నిల్వని మెరక ప్రాంతపు నల్లరేగడి నేలల్లో కూడా వరిసాగు చేయడం తగ్గించి కుసుమ, శనగ, ఆవాలు, పొద్దుతిరుగుడు, చెరకు భూసారాన్ని పరిరక్షించుకోవచ్చు.
చెరువులు, కాల్వల కింద గల పల్లపు భూముల్లో నీరు నిలిచి ఉండే భూముల్లో మాత్రమే మురుగు నీటి సౌకర్యం ఏర్పాటు చేసుకొని వరి వేసుకోవాలి.
వానకాలం వరి తర్వాత దుక్కి దున్నకుండా తిల్లేజ్ విధానంలో మినుము, పెసర, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు పంటలను సాగు చేసుకోవడం ఉత్తమం. వానకాలం దుమ్ము చేయకుండా పొడి దుక్కిలో నేరుగా వరి విత్తే విధానంలో వరి పండిస్తే యాసంగిలో ఆరుతడి పంటలు వేసుకోవడం సులభంగా ఉంటుంది.
లోతు దుక్కి చేయడం ద్వారా గట్టి పడిన అడుగు పొరను గుట్టబరేటట్టు చేయాలి
భూసార పరీక్షలు చేయించుకొని నేల చౌడ తీవ్రతను బట్టి జిప్సం వేసుకోవాలి. అందుబాటులో ఉండే సేంద్రియ ఎరువులను, పచ్చి రొట్టను వేసి కలియ దున్నడం వల్ల వరి సాగు వల్ల కలిగే భౌతిక సమస్యలు మెరుగుపరుచుకోవచ్చు.