హాలియా, పిబ్రవరి 15 : బుడిగ జంగాల సామాజిక వర్గం అంటేనే దేశ దిమ్మరులు. బుక్కెడు బువ్వ కోసం దేశమంతా తిరుగుతూ సంచార జీవనం సాగిస్తుంటారు. చినిగిన పాత బస్తా భుజానికి వేసుకొని, పాత సామాన్లు సేకరించి అమ్మగా వచ్చిన దాంట్లో కలో గంజో తాగి జీవనం సాగిస్తుంటారు. అలాంటి బుడిగ జంగాల సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ ప్రజాస్వామ్య స్ఫూర్తితో తన కంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, బలంగా ఉన్న వ్యక్తిపై పోటీలో నిలిచి 35 ఓట్ల తేడాతో విజయం సాధించింది. కోటీశ్వరురాలైన కాంగ్రెస్ అభ్యర్థిపై ఆమె గెలుపొందడంతో హాలియ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్ ఎన్నికల్లో ఆమె సాధించిన విజయం ఎందరికో ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ జంగాల సామాజిక వర్గానికి తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలనే ఉద్దేశంతో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున కడమంచి ప్రమీలకు హాలియా మున్సిపాలిటీలోని నాలుగో వార్డు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు.
చేతిలో చిల్లిగవ్వలేకున్నా ఆమె ఎన్నికల బరిలో నిలబడి తన సామాజిక వర్గానికి చెందిన పలువురు యువకులు, మహిళలను వెంటేసుకొని వార్డులో ఇల్లిల్లూ తిరిగింది. అమ్మా నేను మీ బిడ్డను మీకు సేవ చేసేందుకు వస్తున్నా.. నన్ను ఆశ్వీరదించి.. గెలిపించాలంటూ వార్డులోని ఓటర్ల వద్దకు వెళ్లి విజ్ఞప్తి చేసింది. ఆమె మంచితనానికి ముగ్ధులైన 4వ వార్డు ఓటర్లు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటుకు నోటు ఇచ్చి, మద్యం, చీరలు పంపిణీ చేసినా పేద బిడ్డవైపే నిలిచారు. ప్రమీలాశ్రీనివాస్కే ఓటేసి గెలిపించారు. ఆమె తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై 35 తేడాతో విజయం సాధించింది. హాలియా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక అభ్యర్థి కూడా ఈమెనే. మున్సిపల్ ఎన్నికల్లో ఆమె సాధించిన విజయం ఎందరికో ప్రేరణగా, స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
రూ.25 లక్షలు ఇస్తామని ఆశచూపినా..
కాంగ్రెస్ పార్టీ నాయకులు రూ. 25 లక్షలు తీసుకోని వేసిన నామినేషన్ విత్‌డ్రా చేసుకోవాలని కడమంచి ప్రమీల, ఆమె భర్త శ్రీనివాస్‌కు సూచించారు. డబ్బులు తీసుకోని విత్‌డ్రా చేసుకోకపోతే మీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డా వారు బెదరలేదు. విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ప్రమీల ఇంటికి వెళ్లి మీకు నేను, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందంటూ హామీ ఇచ్చారు. దీంతో ఆమె కాంగ్రెస్ వారు ఇవ్వ జూపిన రూ. 25 లక్షలను తిరస్కరించి బరిలో నిలబడింది. ప్రణాళికాబద్ధంగా ఇల్లిల్లూ తిరుగుతూ తనకు ఓటేసి గెలిపిస్తే సేవకురాలిగా పనిచేస్తానంటూ చెప్పడంతో ఆమె మాటలను నమ్మి, కారు గుర్తుపై ఓటేసిన గెలిపించారు. హాలియా మున్సిపాలిటీలో 11 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందినా 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఏకైక అభ్యర్థిగా ఆమె నిలిచింది.
నా గెలుపు వార్డు ప్రజలు, కేసీఆర్ పెట్టిన బిక్ష..
నేను గెలిచానంటే ఇది నా విజయం కాదు. 4వ వార్డు ప్రజలే గెలిపించారు. ఈ విజయం వార్డు ప్రజలది. నాకు బీ ఫాం ఇచ్చి గెలిపించిన కేసీఆర్ గారిది. నాపై నమ్మకం ఉంచి, గెలిపించినందుకు వార్డు సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా.. వార్డును మున్సిపాలిటీలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతా. నన్ను గెలిపించిన వార్డు ప్రజలకు, పోటీ చేసే అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కు రుణపడి ఉంటా.
-కడమంచి ప్రమీలా శ్రీనివాస్, 4వ వార్డు కౌన్సిలర్, హాలియా