అనేక యుద్ధాల్లో ఆరితేరిన వీరుడెవ్వరు? విజయాన్ని ముద్దాడిన ధీరుడెవ్వరు? సాధించిన రాష్ర్టాన్ని సమున్నతంగా నిలిపిన పరిపాలన దక్షత ఎవరి సొంతం? రెండుసార్లు జనం జేజేలు అందుకొని అప్రతిహత జైత్రయాత్ర సాగించిన విజయుడెవరు? ఒకే ఒక్కడు.. కేసీఆర్.. విజయసాధనలో తనకెవరూ పోటీ లేరని, సకల జనహిత పాలనలో తనకెవరూ సాటిరారని ఢంకా బజాయించిన జన నేత.. పరపీడన చెరబట్టిన దోపిడీ పరిపాలనలో, ప్రజల ఆలోచనలు పరిపరి విధాలా పోతున్న వేళ దారి తెలియని సందిగ్ధంలో బాటలు తీసిన వ్యూహ చతురుడెవరు? అహింసా మార్గంలో అస్తిత్వ పోరా టాన్ని దరి జేర్చిన దార్శనికుడెవరు? స్వపరిపాలన స్వప్నం సాకారం చేసి ప్రగతి పరుగుల మెరుగులు దిద్దిన స్థితప్రజ్ఞుడెవరు? కోట్లాది జనం గుండెఘోషను తన గొంతులో పలికించిన మాటకారి.
గమ్యాన్ని ముద్దాడిన అలుపు లేని బాటసారి కేసీఆర్. ఈ మూడక్షరాల తారక మంత్రం తెలంగాణ విముక్తి గీతమైంది. తెలంగాణ వ్యతిరేకులకు శరాఘాతమైంది. వినూత్న తెలంగాణకు ప్రగతి సుప్రభాతమైంది. తెలంగాణకు నవశకాన్ని ప్రసాదించిన అసమాన వ్యూ హ చతురుడు కేసీఆర్. జలకాళేశ్వరంతో జనసౌభాగ్యానికి సోపానాలు నిర్మించిన అపర మయుడు. గోదారి గంగను చేయిపట్టి కొండలెక్కించిన అపర భగీ రథుడు. ఆకుపచ్చని తెలంగాణను కలగన్న హాలికుడు. కలను నిజం చేయ డం ఎలాగో తెలిసిన నిత్యశ్రామికుడు. తెలంగాణ ఎన్నటికీ మరువని జలప్రదాత.. జయవిధాత. అందుకో జన్మదిన అక్షర నీరాజనాలు.
భూమిపుత్రుడు
తెలంగాణ సూర్యుడు కేసీఆర్
నిశ్శబ్దంలోంచి శబ్దాన్ని పుట్టించి
అచేతనంలోంచి చైతన్యాన్ని రగిలించి
కొయ్యకు వేలాడిన మద్దెలలోంచి
ప్రత్యేక తెలంగాణ
అస్తిత్వ నాదాన్ని మోగించిన
తెలంగాణ సూర్యుడు కేసీఆర్
మనుషులందరూ ఒక్కపాటై తోటై మాటై
పువ్వులన్నీ ఒక్క దండై
కాలువలన్నీ ఒక్క చెరువై
పాటలన్నీ జయగానాలై
ఊపిరి సలుపని కేంద్రం
దీక్షాశయ్యపై తాడో పేడో
వణికించే చలిలో ఎగిసిన ఉష్ణోగ్రతలు
అర్ధరాత్రి అమావాస్య పున్నమైంది
తేనెతుట్టె తీపి చెరగని చిరునవ్వు
వీధులన్నీ మిఠాయి పొట్లాలై
స్ఫూర్తి గీతాలతో
జై జై కాళోజీ, జయశంకర్ అమర్హ్రే
ఊరూరా ఉద్యమ వీధులు
కొమురం భీమ్, సమ్మక్క సారక్కలు
అమరులకు జోహార్లు
స్వాతంత్య్రానికి రెక్కలు!
ఆనందము వాకిట్లోనే ఉంది
గడప దాటనీయలేదు
వలస పెత్తందారుల ముండ్లకంచెలు!
పండు తిన్నాక చెట్టుని మరిచినోళ్లు
నీళ్లు తాగాక బావిని పూడ్చినోళ్లు
ఊరు చేరాక తొవ్వని చెరిపేసినోళ్లు
గురువుకే ఎగనామం బెట్టినోళ్లు
తెలంగాణ సూర్యుని
మరిచిపోవడం, ఓ లెక్కనా?
తెలంగాణ తల్లి నా కంజాతవల్లి
తంగేడు పువ్వుల
తీరొక్క పువ్వుల గౌరమ్మ తల్లి
ఒక్కడుగు వెనక్కి వేయలే
ఒక్క మాట వెనక్కి తీసుకోలే
దొడ్డి కొమురయ్య,
శ్రీకాంతాచారి, పోలీసు కిష్టయ్య
ఎందరెందరో వీరుల రక్తతర్పణం….
అరవై ఏండ్ల బానిస
బ్రతుక్కు చరమగీతమై
స్వేచ్ఛకు సూర్యోదయమై
తెలంగాణకు
చంద్రోదయమైన
భూమి పుత్రుడు
తెలంగాణ సూర్యుడు
మాసిపోడు!
-వనపట్ల సుబ్బయ్య
949276 5358
ఆత్మగౌరవ పతాక
విముక్త నేల మీద స్వేచ్ఛగా
మేం తిరుగాడుతున్నందుకు జననేతా
మీకివే మా జన్మదిన శుభాకాంక్షలు
ఆత్మగౌరవ పతాకను
ఆకాశమెత్తు ఎగరేసిన యోధుడా
పల్లేరులు మొలిచిన నేల మీద
ఆకుపచ్చని అందాలద్దిన రైతుబంధూ
తెలంగాణ తల్లి చిరునామాను
స్వర్ణాక్షరాలతో లిఖించిన మహనీయుడా
చావు నోట్లో తలపెట్టి
సకల అడ్డంకుల్ని సమాధి చేసిన వీరుడా
వదరుబోతుల వ్యూహాలను
నిలువునా తగులబెట్టే చాణక్యుడా
భ్రమలన్నీ ఆవిరవుతున్న వేళ
మా చూపులన్నీ మీవైపే దార్శనికుడా
మా కలల శాశ్వత సాకారానికి
అన్ని మంత్రవిద్యలెరిగిన జాతిపితా
మీకివే మా జన్మదిన శుభాకాంక్షలు
-కోట్ల వెంకటేశ్వరరెడ్డి
94402 33261
ఉద్యమ క్రాంతి

పోరునెల నా పొడిచిన పొద్దు
ఉద్యమాల గడ్డన
ఉదయించిన సూర్యుడు
మన నేల మరవని చరిత్ర
అవని ఆకాశం
శూన్యము లేని
సూర్యుని వెలుగు
నింగి నేల నీరు గాలి
ప్రజల మనసుల ప్రాణ చరిత్ర
మాతృభూమిలో
మహావీరుని గాథ
ఊరుఊరున కనబడే
ఉద్యమ క్రాంతి భాస్కరుడు
పల్లె పొలిమేర ప్రాంతంలో
రాలిన రవి కిరణం
పురుడోసుకొని కన్నది వీరుని
కడుపు పేగు తెంచుకొని పుట్టిన దినం
జనం జరుపుకునే జన్మదినం
ఊరు ప్రజలు చేసుకొనే పండగ రోజు
-దేవరపాగ కృష్ణయ్య
9963449579
జనజలం
రైతుకు నీరు కావాలి
రైతుకు పంట పైకం
భరోసా కావాలి
రైతు కూలిగా కాక
జనం భుక్తిమాలిగా
నిలబడాలి
తడబడకుండ
మోట గిలకలా
మాట మీద నిలబడ్డ
రైతు భరోసా జలం…
కన్ను మూసి తెరచె లోగ
కరెంటు మాయం
ఎపుడొస్తుందో తెలియని
చీకటి గాయం
దోమల కాటు
ఉక్కపోత
సకాలంలో నీరందక
వచ్చిన పంటకు రాని రేటు
కారణం కరెంటు లేటు
అతడు వచ్చాక
రెప్పవాలె లోపే సర్ఫరా
పల్లె పట్నం కార్మిక కర్షక లోకం
అతడి క్రియాశీలతకు హర్షం
అతడొక సాధకుడు
అతడొక ప్రజానేత
అతడొక మయుడు
అతడొక దార్శనికుడు
అతడొక జనజలం
అతడు తెలంగాణ
ప్రజలకు బలం
-రేడియమ్
9291527757
భగీరథునికి వారసుడై…
తెలంగాణ ప్రజల గొంతుక
లొక్కటై నినదించగా
తరతరాలుగ కన్నకలలకు
ఆయువిచ్చెను కేసీఆర్
పదము పదమున ప్రజ్వరిల్లెను
గళము గళమున అగ్గి రగిలెను
ఏరులై ప్రవహించే రక్తం
త్యాగమే నీ రూపమై
తెలంగాణకు పెద్దదిక్కయి
ముందు నిలిచెను కేసీఆర్
ప్రాణత్యాగం చేస్తానంటూ
దీక్షకు పూనిన సాహసి
ఎట్టకేలకు కొట్టుకొచ్చెను
తెలంగాణను మనకు ఇచ్చెను
పాలకుండై ముందు నిలిచెను
ప్రతిన పూనిన పనులు చేయగ
దివిజ గంగను ఇలకు దించిన
భగీరథునికి వారసుండై
గడప గడపకు నీరుదెచ్చి
కానుకిచ్చెను కల్వకుంట్ల
ఆడపిల్లల పెండ్లి భారం
ఆదుకొనే కళ్యాణలక్ష్మి
కేసీఆర్ కిట్స్ ఇచ్చి
కాన్పు భారం కూడా మోసెను
వృద్ధ జీవన దుర్భరత్వం
రూపుమాపెను పెన్షనిచ్చి
అంగవైకల్యాన్ని కూడా
పెన్షనిచ్చి ఆదుకొనెను
గుడిని మార్చెను బడిని మార్చెను
భూమి దేవుల, ఉపాధ్యాయుల
బడుగు జీవన గతిని మార్చెను
తెలుగు యాసకు ఊతమిచ్చెను
తెలుగు కవుల ఘనత చాటెను
-కందాళ పద్మావతి
మహా సత్యాగ్రహి
మోసగించిన ఆంధ్ర దోష సంహతి నెల్ల
ప్రాసంగ నిర్బంధ పథము నుంచి
సరికొత్త శైలిని సంతరించిన యట్టి
వక్తృత్వ ధీశక్తి వరుస జూపి
వ్యూహ నిర్మాణాల దోహదమ్ములలోన
రిపుల ఆత్మికశక్తి అపహరించి
సబ్బండ వర్ణాల సమరాన దూకించి
ఢిల్లీని మంటల తృళ్ల జేసి
యుక్తి సత్యాగ్రహానికి శక్తినిచ్చి
మహిత స్వాతంత్య్ర సంజీవ మార్గమంచు
నిలిచితివి కాదెభారతి నీ కతాన
అఖిల పోరాట మార్గమై అలర లేదె
చెరగెను చీకటు లెల్లను
విరిసెను ఉదయాలు హృదయ వేదిక లందున్
పరుగులు తీసెను గతమది
సురగంగలు పారె ఫల రసోదిత మెదలన్.
పుట్టినరోజట ఉద్యమ
మట్టే బ్రతుకున మలంచు హర్షా త్మునకున్
పుట్టినరోజట గగనము
పట్టున భూమికిని దించు ప్రజ్ఞా నిధికిన్.
కేసీఆర్కు ఆరోగ్య వాసి పెరిగి
జనుల మనసులో వసియించు ఘనత కలిగి
కాలమును మీర జాలిన క్రాంతి బొంది
కవి శుభాకాంక్షలందుచు కదలుగాత.
-కాంచనపల్లి గోవర్ధనగిరి రాజు
అలుపెరుగని శ్రామికుడు

కం: తెలగాణ విముక్తి కొరకై
సలిపెను నుద్యమము తాను చంద్రన్న నిలన్
అలుపెరుగని శ్రామికుడిగ
గళమును వినిపించె ఢిల్లి కన్నులు తెరువన్
కం: నేతలు యెందరొ నున్నను
నాథుడిగా ముందు యుండి నడిపెను పోరున్
గాథగు తెలగాణంబుది
మ్రోతగ మ్రోగించె ముక్తి పొందుట కొరకై
కం: జయహో చంద్రన్నంటున్
నయనంబులపండుగయ్యె నడ్వగ జనమున్
నియమముతో ప్రతి నొక్కరు
మయినడ్చిరి నీవెనుకన మన్ననచూపన్
కం: పథకములవి ప్రజ వృద్ధికి
సతతము సాగించినావు సత్యంబదియున్
పథకము రైతులకిస్తివి
బ్రతుకంతయు మర్వలేని రైతులబంధున్
కం: తొలిముఖ్యమంత్రి చంద్రన్న
సలిపెను పరిపాలనంత సవ్యము గానున్
నిలిచిరి పది వత్సరములు
నొలయించుతు ప్రజల సౌఖ్య, నొద్దిక కృతులన్
కం: పింఛను నిచ్చితి వీవున్
పెంచగ నదిరెండువేలు
పెద్దలకంతన్
యెంచితివి క్షేమంబును
మంచిని కోరంగ
వృద్ధ మనుషుల పట్లన్
-డీ.వినాయక రావు
9059494259
తెలంగాణ బాపు
తెలంగాణ ఉనికిని ఉజ్వలం చేసి –
రాష్ర్టావతరణమే ఆతని తపో దీక్షలో ఫలప్రదమైన లక్ష్యం
ఉద్యమాలెన్ని సాగినా-హత్యలు-ఆత్మహత్యలు
తెలంగాణ తల్లిని ఆగర్భ శోకంలో ముంచెత్తినా
తెలంగాణ సహజ సంపద వనరుల్ని పీల్చి పిప్పి చేసినా
సాహితీ సాంస్కృతిక వైభవాన్ని పాతాళంలో పాతరేసినా
పదవీలాలసత – పతితులు చట్టసభల్లో నిర్వీర్యమైనా
ప్రాంతీయ దురహంకారం దుశ్చర్యల్ని ప్రేరేపించినా
తుపాకీ గొట్టంతో అస్తిత్వ హననం తలపెట్టినా
రాష్ట్ర, కేంద్ర రాజకీయం అరాచకంగా అఘోరించినా
దశాబ్దాలు తెలంగాణ అరణ్య రోదనలో అలమటించినా
చట్టసభల్లో ‘తల్లి తెలంగాణ’ విలవిల్లాడి విలపించినా
గొర్రెల మందల్లా అధికార పీఠంపై
నాయకశ్రేణి మోకరిల్లినా
కటిక చీకట్లను చీల్చే వెలుగు రేఖల్ని ప్రసరించి
వేయి వెలుగుల క్రాంతిపుంజమై దశదిశల్ని ఐక్యం చేసి
మసకేసి మరుగునపడ్డ అస్తిత్వ పునాదుల్ని వెలిగించి
ఒక ఉప్పెనై-ఉద్యమ ఉగ్రరూపమై ప్రాణమొడ్డి ఒడ్డుకు చేర్చిన
తెలంగాణ అవతరణం
ఆతని అంతరంగ మథనంలో ఆవిర్భావం
దశాబ్ద కాలం ప్రగతి పరుగుల పరవళ్లు
అదిగో అతడు అతడే – తెలంగాణ ప్రాభవం
ఆచంద్రతారార్కం వెలుగులీను తెలంగాణం
జాతిపిత చంద్రశేఖరుడి
స్వప్నమే సాకారం
కువిమర్శల సుడిగుండాల
అపస్వరాలు
అధిగమించిన ఆతని
వ్యక్తిత్వ సౌశీల్యం
కాలాతీత చరిత్రలో
ఒక సువర్ణాధ్యాయం
-కే.లక్ష్మణ్ గౌడ్
97049 30509
బ్రతకవలయునయ్య వంద యేళ్లు
తల్లి వెంకటమ్మ తండ్రి రాఘవరావు
కలల పంట అయిన కర్మయోగి
కొదురుపాక శోభ కోదండరాముడై
పూజలెన్నొ జరిపె పుణ్యశీలి
తేజమొకటి వెలిగె తెలంగాణ నేలలో
చింతమడక గ్రామ చిద్విలాసి
ఉడుకుతున్న మనసు ఉద్యమ శిఖరమై
ఉద్యమమున చేర్చె యువతనంత
మేడిగడ్డ జలము మెతుకు సీమను చేర్చ
ఆనకట్ట యొకటి అవతరించె
కల్వకుంట్ల వంశ కరుణశీలి కదిలె
బువ్వ పెట్టు రైతు భుక్తి కొరకు
చెరువు నిండ తిరుగు చేపపిల్లల చూస్తు
పల్లె తల్లి మురిసి పరవశించె
మిషను కాకతీయ మెండుగ జలమివ్వ
చెరువుయున్న పల్లె సిరుల ముల్లె
అవని జనుల బ్రోచు యాదగిరీశుని
గుడిని కట్టినట్టి గొప్ప శిల్పి
అయుత చండియాగమార్భాటముగ చేసి
దైవ కృపను పొందె ధార్మికుండు
కెసియారు గారు కీర్తికి నిలయులై
బ్రతకవలయునయ్య వంద యేళ్ళు
వృక్షజాతికితడు విశ్వసనీయుడు
చెట్టు నాటినాడు పట్టు పట్టి
మాతృభాష రక్ష మహిలోన విజయమై
శాశ్వతత్వమిచ్చు చరితలోన
చంద్రశేఖరుండు చమురయ్యి అలరార
తెలుగు వెలుగుచుండు దీపమోలె
-రాపర్తి శ్రీనివాస్
63003 82718
విలువను పెంచెను విశ్వమందు

పదునాలుగేడులు పలుచన గానీక
నుద్యమంబు నడిపెనుత్తమముగ
ప్రజల మనస్సున రాజిల్లజేసెను
సొంత రాష్ట్ర కలను సంతతముగ
ఆత్మగౌరవమున ఆంధ్ర ప్రభుత నుండి
తాకట్టు విడిపించె ధైర్యమూని
విలవిలలాడెడు తెలంగాణ ప్రాంతపు
విలువను పెంచెను విశ్వమందు
తెచ్చి తెలంగాణ రాష్ట్రము తెగువమీర
వర్ష దశ పాలనము నందు హర్షమెగయ
దీర్ఘకాలపు కలలను దీర్చినాడు
చంద్రశేఖరుండనఘుడు చాలఘనుడు
-చిలకమర్రి కృష్ణమాచార్యులు