కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
వారంతపు సంతపై కౌన్సిల్ సభ్యుల రగడ
2022-23 ఆర్థిక అంచనా బడ్జెట్ సాధారణ సమావేశం
వనపర్తి, ఫిబ్రవరి 18: హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించడంలో కౌన్సిలర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా సూచించారు. జిల్లాకేంద్రంలోని తరుణి ఫంక్షన్హాల్లో మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన 2021-22 సంవత్సరానికి సవరించిన బడ్జెట్, 2022-23 సంవత్సర అంచనా బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంలో వనపర్తి మున్సిపాలిటీ మంచి విజయాన్ని సాధించిందన్నారు. వెజ్ అండ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణానికి (రూ.45కోట్లు) శ్రీనివాసపురం సమీపంలోని సర్వే నెంబర్ 55లో స్థలాన్ని పరిశీలించామన్నారు. రెండు వైకుంఠధామాలకు రూ.కోటి మంజూరయ్యారన్నారు.
మున్సిపాలిటీ ఆదాయానికి గండి
వారంతపు సంత నుంచి వచ్చే మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారని చైర్మన్, వైస్‌చైర్మన్‌కు కౌన్సిలర్ల మధ్య రగడ మొదలైంది. 5 నెలలుగా మున్సిపాలిటీ వారంతపు సంత ఆదాయాన్ని గొర్రెల పెంపకదారులసంఘం సభ్యులు వసూలు చేసుకుంటున్నారని, టెండర్ పొందిన వ్యక్తికి టెండర్ డబ్బులు తిరిగి ఎలా ఇచ్చారని వారు ప్రశ్నించారు. కౌన్సిల్ సభ్యుల ఆమోదం మేరకు తిరిగి రీ టెండర్‌ను నిర్వహిస్తామని చైర్మన్ తెలిపారు. అంతకుముందు కలెక్టర్‌కు మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్‌చైర్మన్ వాకిటి శ్రీధర్ పూలమొక్కను అందజేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (లోకల్‌బాడీస్) ఆశిష్ సంగ్వాన్, కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.