జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి
డ్రైడేలో పాల్గొన్న అధికారులు
ఖిల్లాఘణపురం, ఫిబ్రవరి 18: వేసవిని దృష్టిలో ఉంచుకొని మొక్కల సంరక్షణలో జాగ్రత్తలు పాటించాలని జెడ్పీ సీఈవో వెంకట్‌రెడ్డి సూచించారు. మం డలంలోని ఆయా గ్రామా ల్లో శుక్రవారం నిర్వహించి న డ్రైడే కార్యక్రమంలో భా గంగా రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు ఆయన నీరు పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో హరితహారంలో నాటిన మొక్కలు, ప్రస్తుతం నాటుతున్న మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎండిపోయిన వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని చెప్పారు. అదేవిధంగా నర్సరీలు, ప్రకృతివనాల్లో నాటిన మొక్కలను సంరక్షించాలని అన్నారు. ఉపాధిహామీ ద్వారా 50మందికి పని కల్పించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సామ్యానాయక్, ఏపీవో, ఎంపీవో, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి మొక్కకూ నీరు పట్టాలి: డీఆర్డీవో
పెబ్బేరు రూరల్, ఫిబ్రవరి 18: ప్రతి చెట్టుకూ విధిగా నీరు అందించాలని డీఆర్డీవో నర్సింహులు ఆదేశించారు. వాటరింగ్డే సందర్భంగా శుక్రవారం మండలంలోని జాతీయహరదారికి ఇరువైపులా, వైశాఖాపురంలో నాటిన మొక్కలకు నీరు పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్, సర్పంచ్ రవి తదితరులు పాల్గొన్నారు.
నాటిన మొక్కల లెక్క చెప్పాలి : డీపీవో సురేశ్
అమరచింత, ఫిబ్రవరి 18: హరితహారంలో భాగంగా నాటిన ప్రతిమొక్కకూ లెక్క చెప్పాల్సిన బాధ్యత తమదేనని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం వాటరింగ్డేలో భాగంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీవో నర్సింహయ్యతో కలిసి మండలంలోని క్రిష్ణంపల్లి, నందిమల్ల ఎక్స్‌రోడ్డు గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు నీరు పట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మొక్కలను పెంచేందుకు ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి వన సంరక్షకులను కేటాయించిందన్నారు. మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదన్నారు. కార్యక్రమంలో సర్పంచులు చెన్నమ్మ, రామలింగమ్మ, పంచాయతీ కార్యదర్శి దాసు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రకృతి వనాలను అందంగా తీర్చిదిద్దాలి
వీపనగండ్ల, ఫిబ్రవరి 18: బృహత్ పల్లెప్రకృతి వనాలను అందంగా తీర్చిదిద్దాలని ఎంపీడీవో కతలప్ప సూచించారు. మండలంలోని వీపనగండ్ల, కల్వరాల గ్రామాల్లో శుక్రవారం పర్యటించి బృహత్ పల్లెప్రకృతి వనాలను ఆయన పరిశీలించారు. నాటిన మొక్కలను సంరక్షించాలని ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించి నీరు పోసే కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేశ్ పాల్గొన్నారు.