కలెక్టర్ హరిచందన
నారాయణపేటటౌన్, ఫిబ్రవరి 23: జిల్లాను పోలియో రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ హరిచందన కోరారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. పల్స్‌పోలియోపై విస్తృతంగా ప్రచారం చేపట్టాలన్నారు. ప్రధాన కూడళ్లు, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పోలియో వ్యాక్సిన్ తేదీలు తెలిసే విధంగా బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించి పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఎంహెచ్‌వో డాక్టర్ రామ్మోహన్, డాక్టర్ శైలజ, డీపీవో మురళి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఊట్కూర్‌లో
ఊట్కూర్, ఫిబ్రవరి 23: పోలియో మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలించేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామని ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి అన్నారు. బుధవారం మండలకేంద్రంలో పల్స్ పోలియో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే పల్స్ పోలియోలో ప్రతి ఒక్కరూ పాల్గొని 0-5 సంవత్సరాల పిల్లలందరికీ విధిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. కరోనా నియంత్రణలో భాగంగా రెండేళ్లలోపు పిల్లలందరికీ మిషన్ ఇంద్రధనుస్సులో భాగంగా టీకాలు వేయించి వంద శాతం వ్యాక్సిన్ పూర్తికి సహకరించాలన్నారు. పీహెచ్సీ పరిధిలో 15 పోలియో కేంద్రాలు, 1 ట్రాన్సిట్ పాయింట్, 1మొబైల్ టీంను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీహెచ్‌ఈవో విజయకుమార్ వివరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
దామరగిద్దలో..
దామరగిద్ద, ఫిబ్రవరి 23: మండంలోని ప్రభుత్వ దవాఖానలో డాక్టర్ రవీందర్ అధ్వర్యంలో పోలి యో కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఆదివారం నిర్వహించే పోలియో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు.