ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి
కలెక్టర్ హరిచందన
నారాయణపేట, ఫిబ్రవరి 23: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించి పనిచేస్తే వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ హరిచందన అన్నారు. డీఈవో ఆధ్వర్యంలో స్థానిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో బుధవారం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సర్పంచుల వల్లే గ్రా మాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. ముఖ్యంగా పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. అదే స్ఫూర్తితో మనఊరు -మనబడి, మనబస్తీ- మనబడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకే రకమైన నాణ్యత కలిగిన వసతులు ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రతి పాఠశాలకు ఫర్నీచర్, విద్యుత్ ఉపకరణాలు, డైనింగ్‌హాల్ సామగ్రి, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, ఏకరూపకంగా సమకూర్చడం జరుగుతుందన్నారు. తొలి విడుతలో ఎంపిక చేసిన 69 పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, గ్రామ సర్పంచ్‌లు కీలక బాధ్యతలు వహించి తమ పాఠశాలను కార్పొరేట్ స్థాయికి మించి సదుపాయాలు సమకూర్చుకోవాలన్నారు. జిల్లాలో మొత్తం 174 పాఠశాలలను విద్యార్థుల సంఖ్య ఆధారంగా మండల యూనిట్‌గా ఎంపిక చేశారని, ఇందులో నారాయణపేట నియోజకవర్గంలో 69 పాఠశాలలను ఎంపిక చేశామ న్నారు. ఏవైనా కొత్త నిర్మాణాలు చేయాలంటే నాణ్యమైన వాటిని వాడాలని, నాసిరకంగా వాడినట్లు సోషల్ ఆడిట్లో రుజువైతే స్కూల్ కమిటీ సభ్యుల ద్వారా జరిమానా రూ పంలో నిధులు వసూలు చేస్తామన్నారు. మొత్తం మూడు విడుతల్లో జిల్లాలోని 500 పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు, ఏఎంవో విద్యాసాగర్ కరదీపికలోని అంశాలపై వివరణాత్మకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ సురేఖ, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో జ్యోతి, విద్యాశాఖాధికారి లియాఖత్ అలీ, జిల్లా పంచాయతీ అధికారి మురళితోపాటు ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసులు, ప్రధానోపాధ్యాయులు, సర్పంచులు, ఎస్ఎంసీ సభ్యులు పాల్గొన్నారు.