గద్వాల, జూన్ 19 : మున్సిపల్ కార్యాలయంలో స్కూృట్నీ చేయాల్సిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు వేసిన టెండర్ దరఖాస్తు ఫారాలు మున్సిపల్ కమిషనర్ ఇంట్లో పరిశీలించడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఏ కార్యాలయంలోనైనా వివిధ పనుల నిమిత్తం టెండర్ వేసిన దరఖాస్తు ఫారాలను ఆయా కార్యాలయాల్లో పరిశీలిస్తుండగా అందుకు విరుద్ధంగా గద్వాల మున్సిపల్ కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అర్హులకు అన్యాయం చేసే పనిలో కమిషనర్ మునిగి తేలుతున్నాడని బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూరగాయలతో పాటు మాంసం ఇతరవి ప్రజలకు అవసరమైనవి ఒకే చోట లభించాలనే ఉద్దేశంతో గద్వాల వ్యవసాయ మార్కెట్ ఆవరణలో రూ.17కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభించారు. అందులో ప్రస్తుతం రూ. 3 కోట్లతో 38 దుకాణాలు నిర్మించారు. వాటికి గత నెల 19న నోటిఫికేషన్ ఇచ్చారు.
అయితే దరఖాస్తులు అనుకున్న స్థాయిలో రాలేదన్న నెపంతో దరఖాస్తులు చేసుకోవడానికి కమిషనర్ మొదట మూడు రోజులు సొంతంగా గడువు పెంచారు. దరఖాస్తుల ప్రక్రియలో గూడు పుఠాణి జరుగుతున్న విషయాన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో గడువును 16వరకు పెంచి 19న వేలం నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటన కమిషనర్ చేశారు. దరఖాస్తులు అందజేయడానికి16వ తేదీన గడువు విధించడంతో 117మంది అభ్యర్థులు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో నిర్మించిన దుకాణాలకు టెండర్లు దాఖలు చేశారు. మొదట 19న వేలం నిర్వహిస్తామని చెప్పిన మున్సిపల్ అధికారులు, గురువారం పత్రిక ప్రకటన విడుదల చేసి శనివారం వేలం ఉంటుందని చెప్పారు. అక్కడే అసలు కథ మొదలైంది. అధికార పార్టీ నేతలు దుకాణాలు పొందేలా ప్రణాళిక రూపొందించిన కమిషనర్ దుకాణాలకు టెండర్ చేసిన అభ్యర్థుల దరఖాస్తులను మున్సిపల్ కార్యాలయంలో పరిశీలించాల్సి ఉండగా కమిషనర్ అధికార పార్టీ నాయకులకు తొత్తుగా మారి తన ఇంటికి మున్సిపల్ అధికారులను పిలిపించుకొని దరఖాస్తుల పరిశీలన చేపట్టాడు. అయితే పరిశీలన సమయంలో అధికార పార్టీ నాయకులకు దుకాణాలు దక్కేలా ఇతరులు వేసిన టెండర్లను వివిధ కారణాలు చూపుతూ వాటిని తిరస్కరించాలనే ఆలోచనతో మున్సిపల్ కార్యాలయంలో పరిశీలించకుండా తన ఇంట్లో పరిశీలించినట్లు తెలుస్తోంది.
మున్సిపల్ కార్యాలయంలో ఉండాల్సిన టెండర్‌దారుల దరఖాస్తులు కమిషనర్ ఇంట్లో ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు కమిషనర్ ఇంటికి చేరుకొని గుట్టు రట్టు చేశారు. టెండర్లలో బీఆర్ఎస్ నాయకులతో పాటు ఇతరులకు దుకాణాలు దక్కకుండా చేయాలనే ఆలోచనతో కమిషనర్ తన ఇంట్లో దరఖాస్తుల పరిశీలన చేస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కమిషనర్ ఇంట్లో జరుగుతున్న పరిశీలన విషయంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వారి అభ్యంతరాలను కమిషనర్ లెక్క చేయకుండా దరఖాస్తుల పరిశీలన ఇంటిలోనే పూర్తి చేసినట్లు తెలిసింది.
మున్సిపల్ కార్యాలయంలో పరిశీలన చేయాల్సిన దరఖాస్తులు కమిషనర్ ఇంటికి ఎందుకు తీసుకెళ్లాడనేది ప్రశ్నగానే మిగులుతుంది. గత నెల రోజులుగా టెండర్ల ప్రక్రియలో కమిషనర్ ఏకపక్ష నిర్ణయాల వల్ల అర్హులకు దుకాణాలు దక్కకుండా పోయే అవకాశం ఉంది. అధికార పార్టీ నేత అనుచరులకు దుకాణాలు దక్కే విధంగా కమిషనర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ టెండర్లలో వ్యవహరిస్తున్న ప్రతి అడుగు అక్రమంగానే ఉంది. దీనిపై కలెక్టర్‌తో పాటు మున్సిపల్ ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న కమిషనర్‌పై చర్యలు తీసుకొని అర్హులకు న్యా యం జరిగేలా చూడాలని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పులిపాటి వెంకటేశ్, జగదీశ్, మోహన్‌యాదవ్, నాయకులు చిత్తారికిరణ్, రాము లు కోరుతున్నారు.