నాగర్కర్నూల్, మే 25 : నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండల కేంద్రంలోని జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో క్రయవిక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈనెల 20 తేదీ నుంచి స్లాట్లు బుక్ చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు పూర్తి కాకపోవడంతో క్రయవిక్రయదారులు తాసీల్దార్ కార్యాలయం ఎదుట రోజుల తరబడి పడిగాపులుకాస్తున్నారు. తరచూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని, స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వారం రోజులు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని, పనులు మానుకొని రిజిస్ట్రేషన్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుందని పలువురు క్రయవిక్రయ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్లాట్ బుక్ చేసుకొని అన్ని పత్రాలు సిద్ధం చేసుకొని రిజిస్ట్రేషన్ కోసం వచ్చినప్పటికీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో తమ పనులు పూర్తి కావడం లేదని, రిజిస్ట్రేషన్లు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం, జాప్యం కారణంగా దూరప్రాంతాల నుంచి వచ్చిన తమకు ప్రయాణ ఖర్చులు పెరిగి ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. స్లాట్ బుక్ చేసుకున్నా వారం రోజులుగా రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో విసుగు చెందిన క్రయవిక్రయదారులు సోమవారం జాయింట్ సబ్ రిజిస్ట్రార్, తాసీల్దార్ను నిలదీశారు. ఉన్నతాధికారుల సమావేశానికి వెళ్లామని, ఒక రోజు సెలవులో ఉండడం వల్ల రిజిస్ట్రేషన్లు చేయలేకపోయామని పొంతనలేని సమాధానం చెప్పడంతో క్రయవిక్రయదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిజిస్ట్రార్ లేకపోయినా ఇన్చార్జితో అయినా స్లాట్ బుక్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉండగా ఎందుకు పట్టించుకోవడం లేద ని నిలదీశారు. అధికారుల అందుబాటులో లేమ న్న కారణం చూపి వారాల తరబడి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించక పోవడం వెనుక కారణాలేమిటని పలువురు బాధితులు ప్రశ్నించారు. రిజిస్ట్రేషను ఎప్పుడు పూర్తవుతాయోనని బాధితులు అడిగిన ప్రశ్నలకు అధికారులు స్పష్టమైన సమాధానం ఇవవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువులు క్రయవిక్రయదారులు ఆరోపిస్తున్నారు. సోమవారం ఆలస్యమైన రిజిస్ట్రేషన్లు చేస్తామని చెప్పి సబ్ రిజిస్ట్రార్ ఒక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయలేదని స్లాట్ బుక్ చేసుకున్న వారు ఆరోపించారు. ప్రతినిత్యం ఇలాగే కాలయాపన చేస్తూ రిజిస్ట్రేషన్ల విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని క్రయవిక్రయదారులు పేర్కొంటున్నారు. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్లను వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని బాధితులు ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను కోరుతున్నారు.
సమావేశాల వల్ల ఆలస్యమైంది..
ఉన్నతాధికారులతో సమావేశాలు ఉండడం వల్ల స్లాట్ బుక్ చేసుకున్న వారికి సమయానికి రిజిస్ట్రేషన్లు చేయలేకపోయామని తాసీల్దార్ వివరించారు. శుక్రవారం నాగర్కర్నూల్లో ప్రజా పాలనపై కలెక్టర్ సమావేశం ఉండిందని, శనివా రం తాను సెలవులో ఉన్నానని, ఆదివారం సెలవు కావడం, సోమవారం రిజిస్ట్రేషన్లపై వాల్యువేషన్ మీటింగ్ ఉన్నదని, అందుకే స్లాట్ బుకింగ్ చేసుకున్న వారికి రిజిస్ట్రేషన్లు చేయడంలో ఆలస్యమైందని వెల్లడించారు.