Nagarkurnool | వెల్దండ, మే 6 : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో కరాటే మాస్టర్ నీరటి కుమార్ పర్యవేక్షణలో ఉచిత కరాటే శిక్షణ శిబిరం ప్రారంభమైంది. గత 15 ఏళ్లుగా కరాటే మాస్టర్ కుమార్ తాను నేర్చుకున్న విద్యను పదిమందికి పంచాలని ఉద్దేశంతో వందలాది మంది విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
అందులో భాగంగా తను పుట్టిన గడ్డ రుణం తీర్చుకునే విధంగా చిన్నారులకు యుద్ధ విద్య నేర్పించాలని ప్రతి సంవత్సరం ఉచితంగా గ్రామంలో కరాటే శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కుమార్ తెలిపారు. ఆడపిల్లలకు ఆత్మ రక్షణ కోసం కరాటే ఎంతో ఉపయోగపడుతుందని వారికి శిక్షణ ఇవ్వడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని కుమార్ అన్నారు. కొట్ర యువతకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా ఉచితంగా వేసవి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా గ్రామస్తులు తనకు సహకారం అందించాలని మాస్టర్ కుమార్ కోరారు. కరాటే ద్వారా ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు క్రమశిక్షణ పట్టుదల పెంచుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగపర్చుకోవాలని మాస్టర్ కోరారు.