మహబూబ్‌నగర్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆడవాళ్లకు మహా‘లక్ష్మి’కటాక్షం లభిం చింది. ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సు ల్లో ఉచిత ప్రయాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం శనివారం శ్రీకారం చుట్టింది. ఆరు గ్యారెం టీల్లో భాగంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ఆయా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు ఫ్రీజర్నీ స్కీంను ప్రారంభించారు. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లు కోరారు. ఆర్టీసీ బస్సులను సిబ్బంది సుందరంగా ముస్తాబు చేశారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు, విద్యార్థినులకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పిం చా రు. దీంతో బస్సులు మహిళలతో కిటకిటలాడాయి.
ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే.. కండక్టర్లు రూ.0 టికెట్ జారీ చేస్తున్నారు. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులను కూడా ఉచిత బస్సు ప్రయాణం పథకంలో చేర్చాలని డిమాండ్లు వి నిపిస్తున్నాయి. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ పథకానికి మంచి స్పందన లభించింది. అలాగే చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీలో భాగంగా గుర్తించిన అన్ని దవాఖానల్లో రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు కూడా శ్రీకారం చుట్టారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10లక్షలకు పెంపు పథకాలను శనివారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ రెండు పథకాలను అధికారులు, ప్రజాప్రతినిధులు షురూ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన వద్ద కలెక్టర్ రవినాయక్, నాగర్‌కర్నూల్‌లో కలెక్టర్ ఉదయ్‌కుమార్, వనపర్తిలో కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జోగులాంబ గద్వాల జిల్లాలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, నారాయణపేట జిల్లా కేంద్రంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులను ముస్తాబు చేశారు. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లు కోరారు. మహబూబ్‌నగర్ డిపో పరిధిలో 70 పల్లెవెలుగు బస్సులు, 36 ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించారు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి కుటుంబానికి రూ.10లక్షల వరకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించే పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. పల్లెవెలుగు, మెట్రో సర్వీసులు, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. మధ్యాహ్నం 2గంటలకు అధికారులు ఆయా బస్టాండ్లలో ఫ్రీ టికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మహిళా ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులను కూడా ఉచిత బస్సు ప్రయాణం పథకంలో చేర్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం..
చేయూత కార్యక్రమం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ లో భాగంగా గుర్తించిన అన్ని దవాఖానల్లో రూ.10లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందించే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ రెండు పథకాలు మహిళలకు, ముఖ్యంగా పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్లు కోరారు.
2గంటలు దాటినా టికెట్ తీసుకున్నరు..
మహాలక్ష్మి పథకం ద్వారా టీఎస్ ఆర్టీసీ ప్రభుత్వ ఆదేశానుసారం శనివారం మధ్యాహ్నం 2గంటల నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మహిళలకు, బాలికలకు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉమ్మడి జిల్లాలోని కొన్ని డిపోలలో అమలు అంతంతమాత్రంగానే జరిగింది. మధ్యాహ్నం 2గంటలు దాటాక కూడా కండక్టర్లు కొన్ని చోట్ల మహిళల నుంచి డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారు. మహిళలు, వృద్ధులు ఈ విషయమై కండక్టర్లను ప్రశ్నించగా, తమకింకా ఆదేశాలు రాలేదంటూ దబాయించారని తెలిపారు. గద్వాల డిపో నుంచి బయలుదేరిన టీఎస్ 33టీ 2555 నెంబర్ గల బస్సులో జూరాల డ్యామ్‌లో ( నందిమల్ల) ఎక్కిన మహిళా ప్రయాణికుల వద్ద కండక్టర్ టిక్కెట్టును తీసుకున్నారు. ఇదే బస్సులో అమరచింతలోనూ కొందరు మహిళా ప్రయాణికులు ఆత్మకూరుకు వెళ్లేందుకు రాగా, వారి నుంచి కూడా కండక్టర్ టిక్కెట్ తీసుకున్నారు. అప్పటికి సమయం 2:30గంటలు దాటినా ప్రయాణికులతో వాదన చేసి మరీ టిక్కెట్ ఇచ్చారు. ఇదిలా ఉండగా, ఆత్మకూరు బస్టాండ్‌లో మహిళలు ఉచిత ప్రయాణం చేయాలంటూ కంట్రోలర్ శ్రీనివాసులు ప్రచారం నిర్వహించి అందరికీ అవగాహన కల్పించారు. వివిధ డిపోలకు చెందిన బస్సుల్లో మహిళలకు మధ్యాహ్నం 2గంటల నుంచే ఉచిత ప్రయాణాన్ని అమలుచేశారు.
సద్వినియోగం చేసుకోవాలి
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని కలెక్టర్ శ్రీహర్ష, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. శనివారం పట్టణంలోని జిల్లా దవాఖానలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి, చేయూత పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాల్లో మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఈ పథకంలో భాగంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేట డిపోలో 87 పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు అందుబాటులో ఉన్నాయని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఉచిత సేవలు అందుకోనున్నట్లు చెప్పారు. చేయూత పథకంలో భాగంగా ప్రతి కుటుంబానికి రూ.10లక్షలతో సూపర్ స్పెషాలిటీ దవాఖానలో కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు అందుతాయన్నారు. అనంతనం ఆరోగ్య శ్రీ పోస్టర్‌ను విడుదల చేసి, ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. బస్సులలో మహిళలకు టికెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ రంజిత్‌కుమార్, డీఎంహెచ్‌వో సౌభాగ్యలక్ష్మి, ఆర్ఎంవో పావని, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం బాబు, డీఎం లక్ష్మిసుధా, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆరోగ్యానికి భరోసా
జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని, ప్రభుత్వ జనరల్ దవాఖానలో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10లక్షలకు పెంపు కార్యక్రమాలను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచారని, దీంతో ఆట్టడుగు పేదల ఆరోగ్యానికి మరింత భరోసా కల్పించినట్లు అవుతుందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలులో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమలు జరిగేలా పటిష్ట చర్యలు చేపట్టామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో జయచంద్రమోహన్, ప్రోగ్రాం అధికారి సా యినాథ్రెడ్డి, సూపరింటెండెంట్ నరేందర్, మున్సిపల్ క మిషనర్ విక్రమసింహా, వనపర్తి డిపో మేనేజర్ వేణుగోపాల్, ఆర్డీవో అవినాశ్, అసిస్టెంట్ మేనేజర్ దేవేందర్గౌ డ్, ఆర్టీసీ, వైద్య సిబ్బంది, కౌన్సిలర్లు బ్రహ్మచారి, సుమి త్ర, జయసుధ, సత్యం, వెంకటేశ్ పాల్గొన్నారు.
మహిళలకు వరం
మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ ఉదయ్‌కుమార్ శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్లోరిబ్బన్కట్ చేసి ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ జనరల్ దవాఖానలో రాజీవ్ ఆరోగ్యశ్రీలో రూ.10లక్షల వైద్య ఖర్చుల చేయూతను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వేగంగా అమలు చేస్తున్నదన్నారు. మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. అనంతరం పథకాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సుధాకర్లాల్, దవాఖాన సూపరిండెంట్ డాక్టర్ రఘు, ఆర్టీసీ ఆర్ఎంవో శ్యామల, డిపో మేనేజర్ దేవరాజ్, ఆర్టీవో ఎర్రిస్వామి, జెడ్పీటీసీలు రోహిణి, సుమిత్ర, గౌరమ్మ, కౌన్సిలర్ జక్కా రాజ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఉచిత ప్రయాణం అద్భుత పథకం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్యకంగా అమలు చేసిన మహాలక్ష్మీ, చేయూత పథకాలను కలెక్టర్ రవినాయక్ జిల్లా కేంద్రంలో శనివారం ప్రారంభించారు. జిల్లాలోని మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లు రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా తెలంగాణ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఏదైనా గుర్తింపుకార్డును చూపించి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. చేయూత కార్యక్రమం కింద రాజీవ్ ఆరోగ్య శ్రీలో భాగంగా గతంలో ఏడాదికి కుటుంబానికి రూ.5లక్షలతో వైద్యం అందించడం జరిగిందని, ప్రస్తుతం రూ.10లక్షలకు పెంచినట్లు తెలిపారు. పథకాలు మహిళలు, పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు, అడిషనల్ ఎస్పీ రాములు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో భాస్కర్, ప్రభుత్వ ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ జీవన్, ఆర్టీసీ ఆర్ఎం శ్రీదేవి, డిపో మేనేజర్ సుజాత, ఆర్టీవో దుర్గ ప్రమీల, ఎంవీఐ నరేశ్, ఆరోగ్య శ్రీ సేవల కో ఆర్టినేటర్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
పేదలకు ఎంతో మేలు జోగుళాంబ గద్వాల కలెక్టర్ వల్లూరు క్రాంతి
ప్రజల సంక్షేమం కోసం మహాలక్ష్మి, చేయూత పథకాలు ప్రారంభించినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి, జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. ముందుగా జిల్లా ప్రభుత్వ దవాఖాన ఆవరణలో రాజీవ్ ఆరోగ్యశ్రీలో రూ.10లక్షలకు పెంపు పథకాన్ని ప్రారంభించిన అనంతరం బస్టాండ్‌లో మహాలక్ష్మి పథకాన్ని ఎస్పీ రితిరాజ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందేవారని, ఇకపై రూ.10లక్షల వరకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. జిల్లాలో లక్షా 60,066 ఆహార భద్రత కార్డుదారులకు 1,672 ప్యాకేజీలు రాజీవ్‌గాంధీ పథకం కింద వర్తిస్తుందని చెప్పారు. ప్రజలకు మెరుగైనా ఆరోగ్యం అందేలా వైద్య సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. మహిళలకు వయసుతో సంబంధం లేకుండా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ప్రభుత్వం అందిస్తున్నదని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, వైద్యాధికారులు శశికళ, కిశోర్‌కుమార్, ఆర్టీసీ డీఎం మంజుల తదితరులు పాల్గొన్నారు.