మహబూబ్‌నగర్, జనవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అతను ప్రముఖ సైకాలజిస్ట్.. ఉమ్మడి జిల్లాలో పోలీసు రెవెన్యూ యంత్రాంగాలతోపాటు ప్రైవేటు వ్యక్తులకు మానసిక శిక్షణ ఇస్తుంటాడు. ఇదే ముసుగులో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బేస్ స్పోకెన్ ఇంగ్లిష్ పేరుతో ఓ సెంటర్ తెరిచాడు.. సెంటర్ చాటున ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ ఇస్తానంటూ మోసం చేస్తున్నాడని బాధితులు వాపోతున్నారు. భార్యాభర్తలను కౌన్సెలింగ్ ఇస్తానని చె బుతూ.. పిల్లలను తమకు దూరం చేస్తున్నారని శనివారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ సంఘటన పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
ఎస్పీ ఆదేశాల మే రకు టుటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీ లో బేస్ స్పోకెన్ ఇంగ్లిష్ పేరుతో కోచింగ్ సెంటర్‌ను ఓపెన్ చేశాడు. కొన్నేళ్లుగా ఇదే పేరుతో అనేక చోట్ల కోచింగ్ ఇస్తూ.. చివరకు సొంత భవనంలోనూ ప్రారంభించారు. ఇక్కడ సుమారు వందమంది విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లిష్ నేర్చుకునేందుకు చేరారు. ఇక్కడకొచ్చే తల్లిదండ్రులకు మీ పిల్లలకు ఐఏఎస్, ఐపీఎస్‌గా చేస్తానంటూ.. లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్నారని పలువురు ఆరోపించారు.
ఈ మేరకు జిల్లా కేంద్రానికి చెందిన మహేశ్వరి, చంద్రకళ, తిరుపతమ్మ జిల్లా ఎస్పీని కలిసి స్పోకెన్ ఇంగ్లిష్ పేరుతో జరుగుతున్న మోసంపై ఫిర్యాదు చేశారు. తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్ కల్పిస్తారని నమ్మించి డబ్బులు, ప్లాటును తీసుకొని చివరకు తమ పిల్లల్ని ఏం చేయకుండా మానసికంగా హింసించారని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్సైవిజయ్ కుమార్ తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో పెద్ద ఎత్తున బాధితులు బయటికొచ్చే అవకాశముందని భావిస్తున్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు భరోసా సెంటర్లోనూ బాధితులు ఫిర్యాదు చేశారు.