నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 12 : వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. మన ఇంటి పార్టీ పండుగ అని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఈ సభకు నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ సారథ్యంలో నిర్వహించే ఈ సభకు పెద్ద సంఖ్యలో.. స్వచ్ఛందంగా శ్రేణులు తరలిరావాలని సూచించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, ఉద్యమ కార్యాచరణకు కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నట్లు తెలిపారు. సభకు తరలివెళ్లేందుకు 25 బస్సులను ఏర్పాటు చేశామని తెలిపారు. మన నియోజకవర్గం నుంచి 3వేలకుపైగా పార్టీ అభిమానులను తరలించాలన్న ఉద్దేశంతో తన సొంత ఖర్చులతో వాహనాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానన్నారు.
150 కార్లకు తగ్గకుండా ఇక్కడి నుంచి బయలుదేరాలని సూచించారు. భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున 70 క్రూయిజర్లను కూడా బుక్ చేసినట్లు తెలిపారు. అలాగే పార్టీ తరుపున కేటాయించిన 25 బస్సులు సరిపోకపోవడంతో మరో 25 బస్సులను నాగర్‌కర్నూల్ డిపో నుంచి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మర్రి వివరించారు. సభకు వచ్చే జనాభా మేరకు అవసరమైతే హైదరాబాద్ నుంచి సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. దాదాపు 5వేల మందిని వరంగల్ సభకు తరలించేందుకు టార్గెట్ పెట్టుకున్నామని, ఆ దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. ప్రతి వాహనానికి జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అనే జెండాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు చలో వరంగల్ పోస్టర్లను మర్రి జనార్దన్‌రెడ్డి ఆవిష్కరించారు.
కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం
నాడు తెలంగాణకోసం ప్రత్యేక ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన గొప్ప నేత కేసీఆర్ అని మర్రి అన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత అన్ని విధాలా మన రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. గతంలో ప్రాంతీయ పార్టీకి లేని చరిత్ర బీఆర్ఎస్కు ఉందని, 14 ఏండ్లు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి రాష్ర్టాన్ని సాధించినట్లు తెలిపారు. ఉద్యమ నేతనే సీఎంగా పదేండ్లు రాష్ర్టాన్ని అభివృద్ధి చేసి దేశానికే రోల్‌మోడల్ చేశాడన్నారు.
సబ్బండ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, పెంఛన్ల పెంపు, బాలింతలకు కేసీఆర్ కిట్స్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మన ఊరు-మనబడి ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు మెరుగైన విద్య, విద్యార్థులకు పోషకాహారం, బీసీబంధు, దళితబంధుతోపాటు మత్స్యకారులకు చే పలు, యాదవులకు గొర్రెల పంపిణీ చేసి అన్ని వ ర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు అ న్నారు. ప్రజలంతా మళ్లా ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారన్నారు. సమావేశానికి నాయకులు బైకాని శ్రీనివాస్ యాదవ్, అర్థం రవి, బాలాగౌడ్, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.