మక్తల్, జనవరి 5 : రైతులను కాంగ్రెస్ నిలువునా మోసగించిందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అలవి కాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ వాటిని అమలు చేయడంలో చతికిలబడుతుందన్నారు. కేసీఆర్ రైతుబంధు రూ.10వేలు ఇవ్వగా, మేం అధికారంలోకి వస్తే రూ.15వేలు ఇస్తామని గొప్పలు చెప్పిన రేవంత్రెడ్డి నేడు రూ.12వేలు ఇస్తామనడం సిగ్గుచేటన్నారు.
రైతులను మోసం చేయడమే కాంగ్రెస్ ఎజెండాగా ఆయన అభివర్ణించారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఎకరాకు రెండు పంటలకు కలిపి రూ.15వేలు ఇస్తామని చెప్పి సంవత్సరం కాలంపాటు రైతులను మోసం చేసిందన్నారు. ఇప్పుడు రూ.12వేలు అందిస్తామని చెప్పడం ముఖ్యమంత్రికి రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్న రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి పంటకు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ.5వేలు అందించి అండగా నిలిచారన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాకు రూ.15వేలు ప్రతి రైతు ఖాతాలో జమ చేయాలని, లేనిపక్షంలో బీఆర్ఎస్ తరఫున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.