మక్తల్, జనవరి 6 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రైతులకు రైతు భరోసాను రూ.15వేలు చేస్తామని హామీ ఇచ్చి నేడు రూ.12వేలకు పరిమితం చేసి మాట తప్పిందని మక్తల్ మాజీ ఎమ్మె ల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం గతంలో ఇచ్చి న హామీలను అమలు చేయాలని కోరుతూ మంగళవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.
సోమవారం ఆయన హైదరాబాద్ నుంచి ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధిలో ఫోన్లో మాట్లాడుతూ రేవంత్రెడ్డి వరంగల్ డిక్లరేషన్ సభలో రైతులకు రైతుభరోసా కింద ఎకరాకు రూ.15 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చిచ్చారని, కానీ నేడు మంత్రివర్గం రూ.12 వేలకు తీర్మానం చేయడం అంటే రైతులను మోసం చేయడమేనని ఆరోపించారు. ఎన్నికల ముందుకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఒక్క గ్యారెంటీ కూడా సక్రమంగా అమలు చేయడం లేదన్నారు.
ఆరు గ్యారెంటీలు అమలు చేయడంతోపాటు రైతు భరోసాను రూ.15వేలకు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నట్లు చెప్పారు. మంగళవారం ఉదయం 10గంటలకు మక్తల్ తాసీల్దార్ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఈ నెల 8న ఆత్మకూర్, అమరచింత, 9న కృష్ణ, మాగనూర్, 10న నర్వ, ఊటూరు మం డల కేంద్రాల్లోనూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ శ్రేణులతోపాటు రైతులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.