మక్తల్, ఏప్రిల్ 12 : వరంగల్ సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధం కావాలని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి సూచించారు. ఈనెల 27వ తేదీన వరంగల్ జిల్లాలో చేపట్టే భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభకు మక్తల్ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లాని పార్టీ నాయకులు, కార్యకర్తలతో శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ 25సంవత్సరాలు పూర్తి కావొస్తున్న క్రమంలో గులాబీ దళపతి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి పల్లె నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చి విజయంతం చేయాలని కోరారు. పదేండ్ల పాలనలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నిరంగాల్లో అగ్రభాగాన రాష్ర్టాన్ని నిలిపారని గుర్తుచేశారు.
ప్రజలు అడుగకముందే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందజేశారని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలే లక్ష్యంగా స్థాపించిన బీఆర్ఎస్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, వరంగల్లోని రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.