మహబూబ్ నగర్ : సావిత్రిబాయి పూలే 195 వ జయంతి ( Savitribai Phule Jayanti) సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి ( Laxmareddy ) తన సంవత్సరపు పెన్షన్ ( Pension ) ను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు
సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ చైర్మన్ మినగ గోపి, సీఈవో పరమేశ్వరి కి విరాళపు చెక్‌ను అందజేశారు.
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వంద మంది ఉత్తమ ఉపాధ్యాయులకు,95 మంది సంఘ సేవకులకు,134 బీసీ కులాల సంఘ అధ్యక్షులకు సన్మానం చేసి సావిత్రిబాయి పూలే విగ్రహాలను అందజేస్తామని ఫౌండేషన్ చైర్మన్ గోపి, సిఈవో పరమేశ్వరి తెలిపారు. మాజీ మంత్రి మాట్లాడుతూ సమసమాజ స్థాపనకు కృషి చేసిన మహనీయురాలి జయంతి సందర్భంగా నిర్వహించే గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం సంతోషంగా ఉందన్నారు.
స్త్రీ విద్య కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. విద్యతోనే మహిళలకు గౌరవం లభిస్తుందని నమ్మిన వ్యక్తని పేర్కొన్నారు. సమసమాజ స్థాపన కోసం అనునిత్యం ప్రజలను చైతన్యం చేసి,భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక సేవలో కొనసాగారని తెలిపారు.