భూత్పూర్, మే 1 : కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలను ఇచ్చి ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరించిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని తాటిపర్తి, కరివెన, వెల్కిచర్ల గ్రామాల్లో బుధవారం ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథ, ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా పథకాలను పూర్తిగా అటకెక్కించే ప్రయత్నం చేస్తుందన్నారు.
కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లను పుష్కలంగా పంపిణీ చేశారని నేడు కాంగ్రెస్ హయాంలో మహిళలు మళ్లీ బిందెలు పట్టుకొని రోడ్లపైకి వస్తున్నారని విమర్శించారు. అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా గుళ్లు, అక్షింతలతో రాజకీయం చేస్తున్నారన్నారు. మన రాష్ర్టానికి ఒక్క మెడికల్ కాలేజీని, నవోదయ పాఠశాలను కూడా మంజూరు చేయలేదని అలాంటి పార్టీలు మనకు అవసరం లేదన్నారు.
అందుకే కాంగ్రెస్, బీజేపీలను ఓడించి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకుడు సత్తూర్ నారాయణగౌడ్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు సాయిలు, నర్సింహాగౌడ్, సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, వెంకటయ్య, పద్మాజక్కిరెడ్డి, ఫసియొద్దీన్, ఆంజనేయులు, పర్వతాలు, నాగయ్య, బాలస్వామి, గౌస్, అశోక్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.