కొల్లాపూర్/నాగర్‌కర్నూల్, జనవరి 6 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా రేవంత్ సర్కార్ ప్రజల నోట్లో మట్టి కొట్టి రాక్షస ఆనందం పొందుతోందని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. నార్లాపూర్ రిజర్వాయర్ సందర్శనకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్తోపాటు బీఆర్ఎస్ నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ నార్లాపూర్ రిజర్వాయర్‌లో ఉన్న నీళ్లు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వదిలినవని.. నాడు కేసీఆర్ సీఎం హోదాలో నీటి పం పింగ్ ప్రారంభించారని గుర్తు చేశారు.
ఈ విషయం ప్రజలకు తెలియజేసేందుకే రిజర్వాయర్ బండ్‌పై మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నార్లాపూర్ రిజర్వాయర్‌లో మూడున్నర టీఎంసీలు నిల్వ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపయోగించకలేకపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఈ రిజర్వాయర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ఎల్లూరు రిజర్వాయర్‌లోకి నీళ్లు వెళ్లేందుకు స్లూయిస్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గత సీజన్లో ఎంజీకేఎల్‌ఐలో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నా నార్లాపూర్ రిజర్వాయర్‌లోని నీటిని మళ్లించి వినియోగించుకునే సోయి లేకుండా పోయిందని మండిపడ్డారు. దీంతో వేల ఎకరాల్లో పంటలు ఎండి రైతులు గుండెలు పగిలిపోయాయని ఆవేదన చెందారు.
కేసీఆర్‌కు.. బీఆర్ఎస్ సర్కారు మంచి పేరు వస్తుందనే.. నీళ్లివ్వకుండా రైతుల పంటలను ఎండబెట్టిన దుర్మార్గ ప్రభుత్వం కాం గ్రెస్ అంటూ దుయ్యబట్టారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పెండింగ్ పనులు పూర్తి చేయించాలన్న సోయి ఇక్కడి మంత్రి జూపల్లికి లేదని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టుపై అసలే చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేసీఆర్ ముందుచూపుతో జూరాల డ్యాం వద్ద కాకుండా 365 రోజులు నీళ్లు నిల్వ ఉండే శ్రీశైలం వద్ద పాలమూరు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం వంద శాతం పూర్తయినా.. బీఆర్ఎస్కు పేరొస్తుందనే కృష్ణానీటిని ఎత్తిపోయడం లేదన్నారు. ఫలితంగా వందలాది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కొల్లగొడితే.. లక్షలాది టీఎంసీలు సముద్రం పాలయ్యాయని వాపోయారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం పని చేయడం లేదని, ఏపీ ప్రయోజనాల కోసం పని చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఐఏఎస్ ఆదిత్యదాసును తెచ్చి ఇరిగేషన్ సలహాదారుగా నియమించారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇరిగేషన్ సలహాదారుడుగా ఉన్న ఆదిత్యదాసు కలిసి 90 టీఎంసీలు కాదు.. 45 టీఎంసీలు సరిపోతాయని లేఖలు రాశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సతాయించారని.. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కేసీఆర్ నాయకత్వంలో పచ్చపడ్డ తెలంగాణను మళ్లీ కాంగ్రెస్ గొంతుకోస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదని నిర్లక్ష్యం వహిస్తే పల్లెపల్లెనూ కదిలిస్తామని.. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తామని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.
జూరాల నిల్వ సామర్థ్యం తక్కువ : శ్రీనివాస్‌గౌడ్
జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలసి సందర్శించామని, అక్కడ నీటి నిల్వ సామ ర్థ్యం తక్కువ.. జనవరిలోనే నీళ్లు లేకుండా బురద మాత్రమే ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని నాటి సీఎం కేసీఆర్ ముందుగానే ఆలోచించి రిటైర్డ్ ఇంజినీర్ల సూచనతో 217 టీఎంసీలు ఏడాది మొత్తం నిల్వఉండే నార్లాపూర్ సమీపంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించినట్లు తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వలసలు నివారించడానికి ఈ ప్రాజెక్టును అతి తక్కువ సమయంలో పూర్తి చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క టీఎంసీ నీటిని కూడా నేటికీ ఎత్తిపోయలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరొస్తోందన్న ఉద్దేశంతోనే పాలమూరు ప్రాజెక్టును ఎండగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు.
70 ఏండ్లపాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందని, మళ్లీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లా అన్యాయం చేస్తుందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాసు తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖకు సలహాదారుడిగా నియమించారని, దాసు ఎవరి ప్రయోజనాల కోసం పని చేస్తారని ప్రశ్నించారు. రేవంత్ సర్కార్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు పల్లెపల్లెకు వెళ్తామని, పాదయాత్రలు చేసి ఇక్కడి ప్రజలకు, రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి కాంగ్రెస్‌ను నిలదీస్తామని ఆయన హెచ్చరించారు.
అడుగడుగునా పోలీస్ పహారా..
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శనకు మంగళవారం ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్యయాదవ్తోపాటు బీఆర్ఎస్ నేతలు తరలివచ్చారు. అంతకుముందు గులాబీ పార్టీ బృందానికి నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం పాలమూరు ప్రాజెక్టు డెలివరీ సిస్టమ్‌ను, నార్లాపూర్ రిజర్వాయర్‌లో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నింపిన కృష్ణానీటిని పరిశీలించారు. బీఆర్ఎస్ ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ ప్రజాప్రతినిధులకు శ్రీశైలం వద్ద నిర్మించిన పాలమూరు ప్రాజెక్టు వివరాలను మాజీ మం త్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ వివరించారు.
బీఆర్ఎస్ బృందం వస్తుందని తెలియగానే అంజనగిరి పరిసర ప్రాంతాలు పోలీసుల పహారాలోకి వెళ్లాయి. అడుగడుగునా ఇంటలిజెన్స్ పోలీసులతోపాటు కొల్లాపూర్ సీఐ, వివిధ మండలాల ఎస్సైలు ప్రాజెక్టు పరిసర పాంత్రాల్లోకి వచ్చారు. ఈ సందర్శనతో కాంగ్రెస్ ప్రభుత్వంలో వణుకు పుట్టినట్లు అయింది. శ్రీశైలం నిండుకుండలా ఉన్నా.. కేసీఆర్ హయాంలో పీఆర్ఎల్ఐ పూర్తయినా కృష్ణా నీటిని ఎత్తిపోయడం లేదన్న విషయాన్ని ప్రజల ముందు పెడ్తారన్న భయంతో ప్రభుత్వంలో మొదలైంది. ఉమ్మడి పాలమూరుకు తీవ్ర అన్యాయం జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సైరన్ మోగించి బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు రావడంతో రైతులు ఘన స్వాగతం పలికారు. మాజీ మ ంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేలు నార్లాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు కృష్ణానది నీళ్లతో నింపిన రిజర్వాయర్‌ను చూసి సంబురపడ్డారు. నీళ్లు పుష్కలం గా ఉన్నా ఉపయోగించుకొలేని అసమర్థత స్థితిలో ప్రభుత్వం ఉండటాన్ని చూసి మండిపడ్డారు.