కోస్గిలో రైతు నిరసన దీక్ష .. హాజరైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పచ్చి అబద్ధాల కోరని.. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ రైతు నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడారు. కొడంగల్‌లో పేదల ఓట్లతో గెలిచి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిందేమీ లేదని దుమ్మెత్తి పోశారు.
ఎనుముల అన్నదమ్ములు, అదానీ, అల్లుడి కోసమే కొడంగల్ నియోజకవర్గంలో ఏడాది నుంచి కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. తన మనుషులకు రూ.వేలకోట్ల విలువైన భూములను దోచిపెట్టడానికే లగచర్ల రైతులపై అక్రమ కేసులు బనాయించారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా హామీలను అమలు చేస్తున్నానని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి, రాష్ట్రంలో ఏ గ్రామానికి పోదామో చెప్పు.. ఒక్క గ్రామంలో వందశాతం పథకాలు అమలైతేగిట్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని కొడంగల్‌తోపాటు తెలంగాణ మొత్తం ఎదురుచూస్తున్నదని కేటీఆర్ అన్నారు. లంకె బిందెలు ఉన్నాయి అనుకుని.. అడ్డమైన హామీలు ఇచ్చానని రేవంత్‌రెడ్డి చెప్పుకుంటున్నాడు.. ప్రభుత్వ ఖజానాలో లంకె బిందెలు ఉంటాయా అంటూ ప్రశ్నించారు. రైతు రుణమాఫీకి ఇచ్చే నిధుల విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం గోల్మాల్ చేసిందన్నారు. మొత్తం రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమైతే కేవలం రూ.11వేల కోట్లు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం గప్పాలు కొట్టుకుంటుందని..చారాన మందం కూడా రుణమాఫీ కాలేదన్నారు.
తులం బంగారం ఇయ్యలేదు. స్కూటీ లేదు.. రుణమాఫీ చెయ్యలేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ 12సార్లు రైతుబంధు ఇచ్చిండు. రూ.73,000 కోట్లు రైతుల ఖాతాల్లో కేసీఆర్ వేశారన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రైతుబంధు కోసం రూ.7,600 కోట్లను జమచేస్తే ఎన్నికల కమిషన్‌కు బడే భాయ్ మోదీ, ఛోటే బాయ్ రేవంత్ రైతుబంధు వేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి నాలుగు నెలలు ఆపి రైతుబంధు పేరిట రైతుల ఖాతాల్లో వేసి ఎన్నికలయ్యాక నిలిపివేశాడన్నారు. ఇప్పు డు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయంట మళ్లీ పథకాల పేరిట జపం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాయంటే రేవంత్‌రెడ్డి రైతుబంధు వెయ్యడుగాక వేయడన్నారు.
జనవరి 26న కోస్గి గడ్డపై రైతుబంధు ఇస్తానని.. ఆత్మీయ భరోసా ఇస్తానని.. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని.. రేషన్ కార్డులు ఇస్తామని పథకాలు అమలు చేసి ఇయ్యకుండా ప్రజలను మోసం చేసింది సీఎం రేవంత్‌రెడ్డి అని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి మీద రైతులు, ప్రజలకు నమ్మకం పోయిందని.. ఎట్లా గెలిపించుకున్నామో.. ఇప్పుడు అట్లే ఓడగొడదామని కొడంగల్ ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కోస్గి, లగచర్లలో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు.. అక్కడ వద్దనుకున్న కంపెనీల్లో పొల్యూషన్ ఇచ్చే కంపెనీలను లగచర్లలో పెడదామని రేవంత్ ప్రయత్నించారన్నారు.
కానీ లగచర్ల రైతులు రేవంత్‌కు తగిన బుద్ధి చెప్పారన్నారు. అందరూ అమాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని.. ఓటు వేసిన పాపానికి రైతులను జైలుకు పంపించి వాళ్ల భూములు లాక్కునే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. ఇక్కడ ఓటు వేసి ముఖ్యమంత్రిని చేసిన రైతులను జైలుకు పంపించిన ఘనత రేవంత్‌కు దక్కిందన్నారు. లగచర్ల రైతులను కేటీఆర్ కుటుంబ సభ్యులుగా ఆదుకుని జైలు నుంచి విడిపించుకోచ్చారన్నారు. ఒక్కో రైతుపై రెండు నుంచి నాలుగు కేసులు పెట్టిన కూడా కేటీఆర్ స్పందించి న్యాయ సహాయం చేశారన్నారు. అనేక ఇబ్బందులు పెట్టిన రైతాంగాన్ని ఆదుకున్న వ్యక్తి కేటీఆర్ అన్నారు. కొడంగల్‌లో బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని.. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.
కేటీఆర్ దత్తత తీసుకున్నాక రూ.5వేల కోట్లతో కొడంగల్‌ను అభివృద్ధి చేశామన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో మూడు దవాఖానలు కట్టినం.. సీఎం హయాంలో ఇప్పుడు ఆ దవాఖానల్లో సిబ్బంది లేదు.. మందుల్లేవన్నారు. అనంతరం పేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై ప్రజలకు విసుగు వచ్చిందన్నారు. దామరగిద్ద మండలం సబ్‌స్టేషన్ పేరుతో భూములు లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్, నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్, బాల్కా సుమన్, పార్టీ నాయకులు సలీం, రామకృష్ణ, వెంకటనర్సింహులు పాల్గొన్నారు.
కౌరవరాజు దుర్యోధనుడిలా ఏడాదిగా అరాచకాలు చేస్తున్న రేవంత్‌రెడ్డికి ఎదురొడ్డి కొడంగల్ ఆడబిడ్డలు, అన్నదమ్ములు పోరాడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఏడాదిగా లగచర్ల, కొడంగల్‌లో కురుక్షేత్ర యుద్ధం నడుస్తుందని.. వారి పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. 14 నెలల పదవీకాలంలో కొడంగల్‌లో రైతులు, మహిళలు, వృద్ధులు, యువత కోసం రేవంత్‌రెడ్డి ఒక్క పనికూడా చేయలేదన్నారు. కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచిపెట్టడానికి కొడంగల్ భూములు ధారాదత్తం చేయడానికి రేవంత్‌రెడ్డి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడని విమర్శించారు. లంబాడీ ఆడబిడ్డలు గడప దాటి బయటకు రారు.. అలాంటి వాళ్లను ఢిల్లీ వెళ్లి న్యాయం కోసం అడిగేలా రేవంత్‌రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించాడన్నారు.
ఎకరం రూ.60-70 లక్షలు విలువ చేసే భూములకు రూ.10లక్షలు పరిహారం ఇవ్వడం ఏంటని అడిగినందుకు లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు బనాయించారన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను వదిలేసి కేవలం బీఆర్ఎస్ నేతలపైనే అక్రమంగా కేసులు పెట్టిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందన్నారు. కొడంగల్ రైతుల కోసం పట్నం నరేందర్‌రెడ్డి జైలుకు పోయిండు.. నీలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి దొంగలా దొరకలేదన్నారు. అర్ధరాత్రి పోలీసులను ఊరు మీదికి పంపి లంబాడి ఆడబిడ్డలను రేవంత్‌రెడ్డి అవమానించాడన్నారు. బంజారా ఆడబిడ్డల పోరాటంతోనే లగచర్ల రైతులకు న్యాయం జరిగిందన్నారు. కొడంగల్ రైతుల భూ పోరాటానికి బీఆర్ఎస్ అండగా నిలబడిందని.. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ ఆడబిడ్డలు రేవంత్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిస్తారనీ కేటీఆర్ జోస్యం చెప్పారు.
మార్పుమార్పు అని ప్రజలను ఏ మార్చిన తర్వాత ఇవాళ ఫలితం చూస్తున్నామని కేటీఆర్ అన్నారు. రాజకీయ భిక్షను ప్రసాదించిన కొడంగల్‌ను అవమానిస్తున్నాడు.. కొండలు, తొండలు గుడ్లు పెట్టని భూములంటూ రైతులు, గిరిజనులను అవమానిస్తున్న వ్యక్తి రేవంత్‌రెడ్డి అని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో కందిపప్పుకు గుర్తింపు తెచ్చింది కేసీఆర్ హయాంలోనే అని.. అలాంటి కందిపప్పు కొడంగల్, నారాయణపేట, వికారాబాద్ తదితర ప్రాంతాల్లో పండుతుందని ఈ విషయం సీఎం రేవంత్‌కు తెలియదన్నారు. జియో గ్రాఫికల్ ఐడెంటిటీని తీసుకొచ్చి కందిపప్పు దేశీయంగా పేరు తీసుకురాగా.. ఇప్పుడున్న సర్కారు కందులను కొనకుండా రైతులను అవమానిస్తుందన్నారు. తొండలు గుడ్లు పెట్టిన భూములైతే ఈ గుర్తింపు ఎలా వస్తుందని ప్రశ్నించారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ప్రతిఏటా అద్భుతమైన రీతిలో తెలంగాణ వ్యవసాయాన్ని తీర్చిదిద్దుకున్నామని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతంటే చెమట చుక్కకు ప్రతిరూపం అన్నట్లు గౌరవం తీసుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. కష్టానికి విలువ తెచ్చిన నాయకుడు కేసీఆర్.. భూమికి విలువలు పెంచింది కేసీఆర్.. పంటలను పెంచిన నాయకుడు కేసీఆర్.. పంటలు కొన్న నాయకుడు కేసీఆర్.. కష్టానికి పెట్టుబడి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు.