మహబూబ్‌నగర్ అర్బన్, జనవరి 7 : మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటు చేశామని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పట్టణ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు మొదట ప్రాధాన్యత ఉంటుందని, ఎన్నికల్లో పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపు కోసం సమిష్టిగా పనిచేయాలని సూచించారు. పోటీకి అవకాశం రానివారు నిరుత్సాహ పడవద్దని, భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయన్నారు.
అధికారులు రిజర్వేషన్లు లాటరీ తీసే టైంలో నాయకులు అప్రమతంగా ఉండాలి. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేనిలోటు ప్రజలకు కనిపిస్తుందని, గ్రామాల్లో పర్యటనకు వెళ్తే ప్రజలు సమస్యలను ఏకరువు పెడుతున్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో విద్యావైద్యం ఉపాధి రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. మెడికల్ కళాశాలతోపాటు వెయ్యి పడకల దవాఖాన తీసుకువచ్చామ న్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోని నిర్మాణ పనులు చాలా వరకు ఆగిపోయాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయలేదనీ ఇలాంటి వాటిని ప్రజల్లోకి వీటిని తీసుకెళ్లాలని వివరించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే నిలిచిపోయిన అభివృద్ధి పనులతోపాటు హైదరాబాద్‌కు సమాంతరంగా పాలమూరును అభివృద్ధి చేస్తామని వివరించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ఆంధ్రా ప్రాంతానికి మేలుచేసే విధంగా కాంగ్రెస్ పాలన సాగుతుందని విమర్శించారు. కార్యక్రమంలో మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్, గ్రంథాలయాల సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రహెమాన్, పార్టీ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు గణేశ్, శ్రీనివాస్‌రెడ్డి, అనంత్‌రెడ్డి, అన్వర్‌పాషా, ఆంజనేయులు, ప్రవీణ్, నరేందర్, రాము, వేదావత్, కిశోర్, సుధాకర్ పాల్గొన్నారు.
