హన్వాడ, మే 1 : ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుకోళ్లు వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కొనుకోలు కేంద్రంలో ఆరబెట్టిన వరిధాన్యాన్ని పరిశీలించి రైతులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు వరిధాన్యం తేచ్చి 15రోజులు కావస్తున్నా కొనుగోళ్లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు.
ఆకాల వర్షాలకు తడిసిన వడ్లను కూడా కొనుకోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు అమ్మిన ధాన్యానికి సకాలంలో డబ్బులు అందేలా ప్రభు త్వం కృషి చేయాలన్నారు. రైతులకు బోనస్ డబ్బులు అందడంలేదని, ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులకు మోసం చేసిందన్నారు. తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రాల వద్ద రైతులకు తాగునీటితోపాటు సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, బీఆర్ఎస్ నాయకులు లక్ష్మయ్య, జంబులయ్య, నాగన్న, మాదవులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.