మహబూబ్‌నగర్, మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 15 : రెక్కాడితే గానీ డొక్కాడని పేదలు పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అలాంటి పేద వ్యాపారులపై ఆర్టీసీ అధికారులు జులుం ప్రదర్శించి బుల్డోజర్లతో వారి మీదకు రావడం ఏమిటని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ పట్టణంలోని కొత్త బస్టాండ్‌పై ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్లు, పండ్ల వ్యాపారులతోపాటు చిరు వ్యాపారుల కుటుంబాలను మాజీ మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా పండ్ల వ్యాపారుల ఆయనకు పలు సమస్యలను విన్నవించారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ చిరు వ్యాపారాలు చేసుకొని బతుకుతున్న వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడడం దుర్మార్గమన్నారు.
పేద పండ్ల వ్యాపారాలను తొలగించాలంటే ముందుగా ఎఫ్టీఎల్ జోన్లో బస్టాండ్ ఉందని, వెంటనే బస్టాండ్‌ను తొలగించండి.. పేదలకు ఒక న్యాయం.. మీకో న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. బస్టాండ్ ముందు ఉంటేనే వాళ్ల వ్యాపారాలు జరిగి కుటుంబ పోషణ చేసుకునే అవకాశం ఉందన్నారు. వ్యాపారులు ఇక్కడే కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలా కాదని తొలగింపు ప్రక్రియ చేపడితే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని, అవసరమైతే అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అవసరమైతే పండ్లు అమ్మకం చేసేందుకు ఆర్టీసీ నిర్మాణం చేసిన దుకాణాలు ఉచితంగా ఇవ్వాలని కోరారు.
గతంలో ఇదే ప్రాంతంలో అత్యాధునిక పండ్ల మార్కెట్ కట్టాలని నిర్ణయం తీసుకొని ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపిచామని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం, అధికారులకు పేదల పండ్ల షాపులు ఇబ్బందిగా అనిపిస్తే ప్రతిపాదనలకు అవసరమైన నిధులు తీసుకువచ్చి కొత్త మార్కెట్ నిర్మాణం చేయాలని కోరారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో వెయ్యి పడకల దవాఖాన నిర్మాణం చేసినట్లు తెలిపారు. దీంతో వీరి వ్యాపారాలు కూడా చక్కగా సాగుతున్నాయని వివరించారు. మాజీ మంత్రి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, ముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, సీనియర్ నాయకులు రాంలక్ష్మణ్, శ్రీనివాస్‌రెడ్డి, నవకాంత్, ఇమ్రాన్ పాల్గొన్నారు.