వనపర్తి, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ సిద్ధాంతకర్త, తన చివరి శ్వాస వరకు స్వరాష్ట్రం కోసం పరితపించిన నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో శూన్యంలో సునామీ సృష్టించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో జాతీయజెండాతోపాటు బీఆర్ఎస్ జెండాలను మాజీమంత్రి సింగిరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ సార్ తన 16వ ఏటనే తెలంగాణ ప్రాధాన్యతను వివరిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మకద్రోహిగా మొదటి నుంచి రామ్ మనోహర్ లోహియా, జయప్రకాశ్ నారాయణ్, ఎన్టీఆర్‌లాంటి వారంతా భావిస్తూ వచ్చారని, వారి మార్గదర్శనంలో కేసీఆర్ తన శ్వాస, ధ్యాస తెలంగాణ రాష్ట్ర సాధనగా ఉద్యమం నడిపించారన్నారు. 14ఏండ్ల్లు అహింసహితంగా ఉద్యమం చేపట్టి రాష్ర్టాన్ని సాధించి ప్రజల్లో నెలకొన్న నిరాశ, నిసృహలను దూరం చేసిన మహనాయకుడు కేసీఆర్ అన్నారు. జయశంకర్ జీవితం ఒడవని పుస్తకమని, వీరి స్ఫూర్తితోనే కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి 9 ఏండ్ల్లు సుపరిపాలన అందించారని సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు.
రెండేళ్లలోనే వ్యతిరేకత
కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలన చూసిన ప్రజలు కేవలం రెండేళ్ల కాలంలోనే కాంగ్రెస్ విధ్వంసపు పాలనను తిరస్కరించారని నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రైతు భరోసా, రైతు బీమా, రైతు రుణమాఫీ చేయకుండా నిర్లక్ష్యం చేశారని, చివరకు యూరియాను కూడా రైతులకు అందుబాటులో లేకుండా చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రైతుల ఉసురుతోనే కాంగ్రెస్ పార్టీ పతనం కావడం ఖాయమని, మహిళలకు రూ.2500, తులం బంగారం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీలు, కేసీఆర్ కిట్టు, దళితబంధు, బీసీబంధు లాంటి పథకాలను కాంగ్రెస్ సర్కార్ బొందపెట్టిందన్నారు.
ప్రజలు రాష్ట్రంలో కేసీఆర్ పాలన రావాలని నిర్ణయించుకున్నారని, ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుదామని నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతకు ముందు ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్‌గౌడ్, శ్రీధర్, గట్టు యాదవ్, అశోక్, ప్రేమ్‌నాథ్ రెడ్డి, తిరుమల్, సర్దార్‌ఖాన్, ప్రేమ్‌కుమార్, కుమార్ యాదవ్, జాతృ నాయక్, మాణిక్యం, ఏర్వ అరుణ, కవిత పాల్గొన్నారు.