వనపర్తి, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : యాసంగిలో పంటలు సాగు చేసిన రైతులకు సాగునీరు అందించాల్సిందేనని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. యా సంగి సీజన్లో వ్యవసాయానికి సాగునీళ్లు లేవని చెప్పడం పూర్తిగా ప్రభుత్వ అసమర్థతగా పేర్కొన్నారు. యాసంగికి ముందే ఇరిగేషన్ బోర్డు సమావేశం జిల్లా మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కానీ అలాంటి వాటికి తిలోదకాలు ఇస్తూ కేవలం ఒక డీఈ స్థాయి అధికారితో యాసంగిలో సాగునీరు ఇవ్వలేమని చెప్పించడం విడ్డూరంగా ఉందన్నారు.
మంత్రికి, ఎమ్మెల్యేలకు రైతులపై ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టి అర్థమవుతోందన్నారు. రైతులకు నష్టం కలగకుండా పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. యాసంగికి సాగునీటి సమస్య వచ్చేది కాదని, ఇప్పటికైనా పంటలకు నీటి ఢోకా రాకుండా అందించాలని కోరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ ఎత్తిపోతల పథకాల పరిధిలో దాదాపు ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించే జూరాల ప్రాజెక్టు ద్వారా కొడంగల్ ఎత్తిపోతలకు నీరు అందడం అసాధ్యమన్నారు. కేవలం పంథాలకు పోయి జూరాల ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల ప్రతిపాదన చేస్తున్నారని, దీంతో భవిష్యత్‌లో అక్కడి రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. మరొకసారి ఈ ఎత్తిపోతలపై పునరాలోచించాలని మాజీ మంత్రి కోరారు.
ఎమ్మెల్యేగా, మంత్రిగా కేసీఆర్ ప్రభుత్వంలో కొనసాగిన జూపల్లి ఇటీవల సాగునీరివ్వలేదని మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. బీ ఆర్ఎస్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన జూ ప ల్లి తను అప్పట్లో మాట్లాడిన మాటలను మరిస్తే ఎ లా అన్నారు. నాడు మంత్రిగా జొన్నలబొగుడ రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌లను నిరంజన్‌రెడ్డి మీడియాకు చూయించారు. అందులో.. ‘గత పాలకులు కేఎల్ఐని పట్టించుకోలేదని, 1984 నుంచి 2004 వరకు కేవలం రూ.12 కోట్లు మాత్రమే ఖర్చు చేసి నిర్లక్ష్యం వహించారు’.. అని ఆ వీడియోలో మాట్లాడారు. అయితే, ఎక్కడ మంత్రిగా ఉంటే అక్కడి సీఎంకు భజన చేయడం అలవాటు చేసుకున్నట్లుగా ఆయన వ్యవహారం ఉందన్నారు.
అప్పటి ప్రభుత్వం పని చేయకుంటే మంత్రిగా ఎందుకు కొనసాగారని, దాదాపు 20 ఏండ్లపాటు ఎమ్మెల్యేగా, మంత్రిగా అనుభవం ఉండి ఇంత నిస్సిగ్గుగా మాట్లాడటం తన విజ్ఞతకే వదిలివేస్తున్నామని చెప్పారు. ఎవరి హయాంలో ఎంత సాగునీరు ఇచ్చామన్నది ఇరిగేషన్ రికార్డులు చెబుతున్నాయని వివరించారు. ఎలాంటి అవగాహ న లేకుండా సీఎం మెప్పు కోసం రాజీనామా చేస్తానంటూ మాట్లాడిన జూపల్లి తన పరువును తానే తీసుకున్నట్లుందని దుయ్యబట్టారు. సీనియర్ మ ంత్రిగా హుందాతనం ప్రదర్శించాలని, అసంబద్ధమైన వాఖ్యలను జూపల్లి ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాకు సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయాలకు కా ంగ్రెస్ ప్రభుత్వంలో కేబినెట్ హోదాలో ఉన్న జూపల్లి, చిన్నారెడ్డిని చరిత్ర క్షమించదని, ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కాంగ్రెస్ పాలకులు పూర్తిగా విస్మరించారని నిరంజన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదైనా ఒక్కసారి కూడా సీఎంతో జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలు ప్రాజెక్టు గురించి చర్చించలేదన్నారు. కేవలం పది శాతం మిగిలిన పనులను పూర్తి చేస్తే ఉమ్మడి జిల్లాలో అదనంగా 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు తెలిపారు. ఇక్కడి రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నాయని, కృష్ణానదికి వరద వచ్చిన సమయంలో నీటిని ఎత్తిపోసి నిల్వ చేస్తే సాగునీటి సమస్యలు ఉండవన్నారు. దాదాపు 70 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు రిజర్వాయర్లను ఉపయోగించుకుంటే సమృద్ధిగా సాగునీటి అందుతుందన్నారు. నీరు సమృద్ధిగా ఉండాలంటే జూరాల, పాలమూరు ప్రాజెక్టుల అనుసంధానం జ రగాలన్నారు. రైతుల ఉపయోగాలను విస్మరించి కేవ లం పట్టుదలకు పోతే తీరని నష్టం జరుగుతుందన్నారు.
అలాగే కేఎల్ఐలో అదనపు రిజర్వాయర్ల ఏ ర్పాటుకు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అప్పుడే లెక్కలు వేసుకుని ప్రజలకు ఎందుకు చెప్పలేదని నిలదీశారు. మోసపూరిత వాగ్ధానాలు చేసి అధికారం చేపట్టాక అప్పులున్నాయని చెప్పడం మరింత మో సం చేయడం తప్పా మరోటి లేదన్నారు. రుణమాఫీలో సర్కారు గుర్తించిన జాబితాలోనే సగం మంది రైతులను పెండింగ్ పెట్టారన్నారు. గతంలో రూ.28 వేల కోట్లను బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా యదార్థం చెప్పండి.. వా స్తవాలను మాట్లాడండి.. లేకుంటే ప్రభుత్వం మరిం త అభాసుపాలు కావడం ఖాయమన్నారు. సమావేశంలో లక్ష్మయ్య, వాకిటి శ్రీధర్, రమేశ్‌గౌడ్, కురుమూర్తి యాదవ్, మాణిక్యం, కృష్ణానాయక్, కరుణశ్రీ, అశోక్, చంద్రశేఖర్, జాత్రు నాయక్, విజయ్, మహేశ్వర్‌రెడ్డి, రాము, సునీల్ పాల్గొన్నారు.