వనపర్తి టౌన్, ఆగస్టు 21 : వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చొరవతో సాగునీరు రావడంతో బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం గ్రామ సమీపంలోని మినీ లిఫ్ట్ నుంచి విడుదలైన సాగునీటిని బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు కే మాణిక్యం, మానాజీపేట రఘువర్ధన్‌రెడ్డి, దేవర్ల నర్సింహ మాట్లాడుతూ గతంలో కానాయయపల్లి దగ్గర 2017లో రిజర్వాయర్ పూర్తికానందున రింగ్‌బండ్‌ను తీసుకువచ్చి డైవర్షన్ బండ్ ద్వారా మా చెరువుకు నీళ్లు కావాలని కిష్టగిరి సర్పంచ్ పద్మమ్మ వెంకటయ్య కోరారని చెప్పారు. మేము సాగునీటితో ఇబ్బంది పడుతున్నామని, మాకు ఒక లిప్టు వచ్చే విధంగా చూడాలని వేడుకున్నారు. దీంతో 2022 లో నిరంజన్‌రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు తన ప్రాబల్యంతో సీఎస్ఆర్ స్కీం కింద నిధులు ఇచ్చి లిఫ్ట్టు మంజూరు చేశారు. వాటికి సంబంధించిన పనులు పూర్తవ్వడంతో ఇప్పుడు నీళ్లు వచ్చాయని, ఈ లిఫ్టుతోపాటు 64 చిన్న లిఫ్ట్టులు మంజూరు చేశారని వారు పేర్కొన్నారు. మాజీ మంత్రి ప్రతి ఎకరానికి నీళ్లు ప్రతి రైతుకు పని అనే నినాదంతో పనిచేశారన్నారు.
ఏ పొలం బీడు ఉండకూడదని లిఫ్టులు, కాల్వలు, చెరువులకు నీళ్లు తెచ్చారన్నారు. కాల్వల వెంబడి పార్టీ కార్యకర్తలను లస్కర్‌గా తిప్పేవారు, ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేయడంతో ఆయ న నీళ్ల నిరంజనుడు అయ్యాడని గుర్తు చేశారు. మాజీ మంత్రి రైతులకు చేసిన సాయం మరువలేనిదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మమ్మ వెంకటయ్య, మండల నాయకులు ధర్మనాయక్, మాధవరెడ్డి, డేగ మహేశ్వర్‌రెడ్డి, నరేశ్, చిట్యా ల రాము, అంజి, గ్రామ పార్టీ నాయకులు, వెంకటయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.