జడ్చర్లటౌన్, ఏప్రిల్ 17 : రాష్ట్రంలో ఓ పేద గిరిజన విద్యార్థి చనిపోతే ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మండలం పలుగుగడ్డ తండాకు చెందిన పీజీ వైద్య విద్యార్థి సురేశ్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మాజీ మంత్రి శుక్రవారం తండాకు వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. సురేశ్‌కు ఎస్వీఎస్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చిన సందర్భంగా అభినందించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడారు. పేద కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి చదివి ఉస్మానియాలో పీజీ సీటు సాధించిన సురేశ్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందటం బాధకరమన్నారు. ఓ పేద గిరిజన విద్యార్థి చనిపోతే మెడికల్ కాలేజీ సిబ్బందిగానీ, ప్రభుత్వం గానీ స్పందించకపోవటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఈ ఘటన నిదర్శనమన్నారు. బాధిత కుటుంబాన్ని ప్ర భుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సురేశ్ మృతిపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో హెల్త్ మినిస్టర్‌గా తాను పనిచేసినప్పుడు ఇలాంటి ఘటనలు జరిగితే అందుబాటులో ఉంటే తాను సత్వరమే వెళ్లి సమస్యను తెలుసుకున్నానని, ఒక వేళ అందుబాటు లో లేనప్పుడు అధికారులను పంపించి సమస్యలు తెలుసుకుని సహకరించామన్నారు. ఇప్పుడున్న ప్రభు త్వం మాత్రం మొద్దు నిద్రపోతున్నదని వి మర్శించారు. దవాఖానలు సరిగా పనిచేయటంలేదు.. డాక్టర్లు అందుబాటులో ఉండటంలేదు. పేద రోగులను పట్టించుకోవటంలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడిక్కడ సిస్టంను వదలిపెట్టిందని విమర్శించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ యా దయ్య, బీఆర్ఎస్ నాయకులు శంకర్‌నాయ క్, ఇంతియాజ్, రఘుపతిరెడ్డి పాల్గొన్నారు.