జడ్చర్లటౌన్, ఆగస్టు 13 : 167వ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా జడ్చర్లలోని ప్రధాన కూడళ్లలోని మహానీయుల విగ్రహాల తొలగింపు విషయంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. జ డ్చర్లలోని సిగ్నల్గడ్డ వద్దనున్న అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, నెహ్రూ, ఇందిరాగాంధీ విగ్రహాలను తొలగించేందుకు గానూ బుధవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి, చైర్పర్సన్ కోనేటి పుష్పలత, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి పోలీసుల సా యంతో వచ్చారు.
మొదటగా నెహ్రూ, ఇం దిరాగాంధీ విగ్రహాలను క్రేన్ సాయంతో తొలగించారు. ఆ తర్వాత అంబేద్కర్, ఫూలే విగ్రహాలను తరలించేందుకు యత్నించగా కుల సంఘాల నాయకు లు అడ్డుకున్నారు. యథావిధిగా అంబేద్కర్, పూలే విగ్రహాలను ఉంచి, రహదారి పనులు చేపట్టాలని పట్టుబట్టారు. విగ్రహాలను తరలిస్తే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దాదాపు ఐదు గంటల పాటు విగ్రహాల తరలింపు విషయంలో కుల సంఘాల నాయకులకు, అధికారుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకున్నది. మహబూబ్నగర్ డీఎస్పీ వెం కటేశ్వర్లు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అక్కడికి చేరుకొని కుల సంఘాల నాయకులతో మాట్లాడారు. రహదారి విస్తరణ పనులు పూర్తయిన తర్వాత విగ్రహాలను యథాస్థానంలో ఏర్పాటు చేయాలా, మరోచోట ఏర్పాటు చేయాలా అన్న విషయంపై అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాల నాయకులు కలిసి నిర్ణయం తీసుకుందామని నచ్చజెప్పటంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత మున్సిపల్ అధికారులు అంబేద్కర్, పూలే విగ్రహాలను తరలింపునకు చర్యలు చేపట్టారు.