వనపర్తి, ఏప్రిల్ 9(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడుతూనే ఉంటాం.. మీ భూములను కాపాడుతాం.. అర్థం..పర్థంలేని గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డుకుంటాం.. మీ వెంటే ఉంటామంటూ 102 రోజుల నుంచి రిజర్వాయర్‌కు వ్యతిరేకంగా దీక్షలు చేస్తున్న రైతులకు మాజీ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. అనంతరం రైతులకు నిమ్మరసం ఇచ్చి రైతుల దీక్షలను విరమింపజేశారు. గురువారం గొల్లపల్లి-చీర్కపల్లి రైతుల దీక్షా శిబిరానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమక్షంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు చేరుకుని రైతులకు భరోసా కల్పించారు.
అనంతరం అక్కడే రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వలస జిల్లాగా మారడానికి కారణం కాంగ్రెస్ అని, ప్రాజెక్టులను పెండింగ్ పెట్టింది కాంగ్రెస్‌యేనని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు జిల్లా తీవ్రంగా నష్టపోయిందన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా గత పదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం మార్చి వేసిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఉంటే, పాలమూరు-రంగారెడ్డిలో మిగిలిన అతి కొద్ది పనులను పూర్తి చేసి ఏదుల, వట్టెం, భూత్పూరు రిజర్వాయర్లన్నీ కళకళలాండించే వాళ్లమన్నారు. సీఎంగా రేవంత్‌రెడ్డి వచ్చిన అనంతరం ఒక్క ఎకరానికైనా కొత్తగా సాగునీరిచ్చాడా అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను బొందవెట్టి పచ్చి అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తున్నాడన్నారు.
రైతు భరోసా, పింఛన్ల పెంపు, తులం బంగారం, కేసీఆర్ కిట్టు, రుణమాఫీలాంటి పథకాలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో కాలం వెల్లదీస్తుందన్నారు. కేవలం 16 వేల ఉద్యోగాలిచ్చి 65 వేల ఉద్యోగాలిచ్చామని ఊదరగొట్టారని, ఇటీవలే అసెంబ్లీలో కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాల లెక్కను బట్టబయలు చేశామని హరీశ్‌రావు గుర్తుచేశారు. అంతకుముందు బీఆర్ఎస్ సిద్ధం చేసిన ఉద్యోగాలను పంపిణీ చేసి తప్పుడు లెక్కలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టించారన్నారు. ఆరు గ్యారెంటీల గురించి ప్రజలు అడిగితే మూడు నెలలకే బిడ్డ పుడతాడా అంటూ రేవంత్ మాట మార్చడం విడ్డూరమన్నారు. రాష్ట్రంలో విద్యార్థులను, రైతులను, కార్మికులను రేవంత్ రెడ్డి ఆగం చేస్తున్నాడని, ఒక యూరియా బస్తా కోసం పొద్దస్తమానం ఎదురు చూసేలా రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతుందన్నారు.

కేసీఆర్ పాలనలో యూరియా కష్టాలను రైతులు ఎక్కడైనా చూశారా అంటూ ప్రశ్నించారు. కేఎల్ఐ పరిధిలోని రామన్న గట్టు రిజర్వాయర్‌కు రూ.50 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రద్దు చేసిందన్నారు. దీనివల్ల పాన్‌గల్, వనపర్తి, కోడేరు మండలాల రైతులకు నీటి ఇబ్బంది లేకుండా పోతుందని దీనిని మంజూరు చేస్తే.. కాంగ్రెస్ వచ్చిన అనంతరం రద్దు చేసి రైతుల పాపం మూటగట్టుకున్నదన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ను గత బీఆర్ఎస్ హయాం లోనే ప్రతిపాదించడం జరిగిందని, అయితే ఏదుల రిజర్వాయర్ నిర్మాణంతో గొల్లపల్లి రిజర్వాయర్‌ను 8 ఏళ్ల క్రితమే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉపసంహరించుకున్నదని ఆయన రైతులకు వివరించారు.
రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉబలాటపడుతుందని, ఆ ఉచ్చులో అన్నదాతలు ఎవరూ పడరన్నారు. నిరంజన్ రెడ్డి చొరవతోనే కేఎల్ఐ ప్రాజెక్టు ద్వారా వనపర్తి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని, గతంలో కేఎల్ఐ ప్రతిపాదన జరిగినపుడు అసలు వనపర్తి నియోజకవర్గమే అందులో లేదని హరీశ్ రావు పేర్కొన్నారు. నిరంజన్ రెడ్డి పుణ్యమా అంటూ నియోజకవర్గంలో సాగునీరు కళకళలాడుతుందని, అనేక రిజర్వాయర్లు నిర్మాణం చేశారని గుర్తు చేశారు. ఏదుల రిజర్వాయర్ ద్వారా గొల్లపల్లి ప్రాంతంతోపాటు వనపర్తి నియోజకవర్గం సస్యశ్యామలంగా సాగునీటిని అందుకుంటుందని హరీశ్‌రావు వివరించారు.
ఏదుల రిజర్వాయర్ నిర్మాణంతోనే గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం ఉపసంహరణ జరిగిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్‌ను ప్రతిపాదించింది అక్షరాల నిజమని, అయితే7 టీఎంసీలతో ఏర్పాటు చేసిన ఏదుల ద్వారా నియోజకవర్గంలోని 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రత్యేకంగా తూంను ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ పరిస్థితిలోనే ప్రజాధనం వృథా కావద్దని, రైతుల భూములను అనవసరంగా ముంచవద్దని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రిజర్వాయర్ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నదని మాజీ మంత్రి మరోసారి గుర్తు చేశా రు.
పదేండ్ల కిందట భూముల విలువ ఒకలా ఉండేదని, ఇప్పుడు అంచలంచెలుగా ఊహకందని రీతిలో పెరిగి పోయింద న్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రైతులకు చెందిన 1300 ఎకరాలను తప్పుడు ప్రచారంతో ముంచుతామంటే చూస్తూ ఊరుకోబోమని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. ముంపు గ్రామాల రైతులను వందశాతం ఒప్పించి నిర్మాణం చేయడం ద్వారా తమకెలాంటి ఆక్షేపణలేదని కూడా వెల్లడించారు. ఏదుల రిజర్వాయర్‌ను వందశాతం రైతులను ఒప్పించి నిర్మాణం చేశామని గుర్తు చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌లో తనకు భూములున్నాయని, అం దుకే రిజర్వాయర్‌ను అడ్డుకుంటున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అధికారంలో ఉన్న వారు ధైర్యముంటే నిరూపించి జైలుకు పంపించాలని సవాల్ విసిరారు.
రైతులతో రాజకీయం చేయడం లేదని, ప్రజాధనం దుర్వినియోగం అరికట్టడానికే రైతులకు మద్దతుగా నిలిచినట్లు పేర్కొన్నారు. కనీస విజ్ఙతలేని కొందరు ఎడాపెడా మాట్లాడుతున్నారని, అలాంటి వారికి సమాధానం చెప్పే రోజు ఆసన్నమైందన్నారు. జిల్లాలో నేరాలు,ఘోరాలు జరుగుతున్నా కనీసం మంత్రి జూపల్లి, ఎమ్మెల్యేలు సహితం అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు.102 రోజులుగా రైతులు దీక్షలు చేస్తే.. ఒక్కరైనా పరామర్శించారా అని ప్రశ్నించారు. దౌర్జన్యంగా రైతులకు వ్యతిరేకంగా ఏది చేసినా చూస్తూ ఊరుకోబోమని, మా మద్దతు రైతులకే ఉంటుందని నిరంజన్ రెడ్డి తేల్చి చెప్పారు.
ఎస్ఎల్బీసీలో కూలీలు చనిపోతేనే దిక్కులేకుండా పోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎద్దేవా చేశారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విఫల కార్యక్రమాలే జరుగుతున్నాయని, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నా రు. ప్రజావ్యతిరేక కార్యక్రమాలను చేస్తున్న ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు చరమగీతం పాడుతారన్నారు. ఉమ్మడి పాలమూరులోని ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి భూములను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.
రైతులకు వ్యతిరేకంగా గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి రూ.1300 కోట్లను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని రాష్ట్ర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కలిసి ఈ ఎత్తుగడకు పథకం వేశారన్నారు. ఏదుల రిజర్వాయర్ నిర్మాణంతో పుష్కలంగా సాగునీరందే అవకాశం ఉన్నా ఎందుకు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో విద్యార్థులు, రైతుల ఆత్మహత్య లు నిత్యకృత్యమయ్యాయని, ప్రభుత్వ పాఠశాలలు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల మూతుపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్‌రెడ్డి,ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నాయకులు నాగం తిరుపతి రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, బైకాని శ్రీనివాస్‌యాదవ్, ఇబ్రహీం, ఇంతియాజ్ ఇసాక్, గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమళ్ల ఆశోక్, చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు.