మహబూబ్‌నగర్, మెట్టుగడ్డ జనవరి 6 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ హోటల్లో చికెన్ బిర్యానీలో బొద్దింక వచ్చినా కస్టమర్లను బెదిరించిన ఘటనపై సోమవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడు లు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్ అపరిశుభ్రంగా ఉండడంతోపాటు నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్ యాజమాన్యానికి నోటీసులు ఇవ్వడంతోపాటు కేసు నమోదు చేశా రు.
ఈనెల 4న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో బిర్యానీలో బొద్దింక అనే శీర్షిక వచ్చిన కథనంపై స్పందించిన అధికారులు దాడులు నిర్వహించి విస్తృతంగా తనిఖీలు చేశారు. అదేవిధంగా నాణ్యత ప్రమాణాల పరిశీలన కోసం చికెన్ బిర్యానీతోపాటు మరికొన్ని ముడి పదార్థాల శాం పిల్స్ సేకరించి లాబరేటరీకి పంపించనున్నట్లు చెప్పారు. ఇందులో ఏమైనా కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అయితే పత్రికల్లో వచ్చిన రెండు రోజుల తర్వాత స్పందించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటనపై హోటల్ యాజమాన్యాన్ని కూడా పెద్దగా ప్రశ్నించక పోవడం గమనార్హం. ఈ తనిఖీల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ విజయ్‌కుమార్, మహబూబ్‌నగర్ జిల్లా ఫుడ్ ఆఫీసర్ శ్రీలత, జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ మనోజ్‌కుమార్, ఇన్చార్జి ఆఫీసర్ కరుణాకర్, అంజిలయ్య తదితరులు ఉన్నారు.