మహబూబ్నగర్, నవంబర్ 21 : మాగనూర్ పాఠశాలలో భోజనం వికటించి చికిత్స కో సం మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో చేరిన విద్యార్థులకు ఇ వాళ ఉదయం అల్పాహా రం అందించగా అందులోనూ పురుగు లు వచ్చిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో మధ్యాహ్న భోజనం వికటించి 35 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
పరిస్థితి విషమించడంతో వారందరినీ మహబూబ్నగర్ జిల్లా జనరల్ దవాఖానకు తరలించారు. సాక్ష్యాత్తు సీఎం సొంత జిల్లాలోనే అనారోగ్యానికి గురైన చిన్నారులకే మళ్లీ పురుగుల టిఫిన్ పెట్టడంపై అందరూ అవాక్కయ్యారు. విద్యార్థులకు మెరుగైన వై ద్యసేవలు అందించాలని ఆదేశించినా దవాఖాన సి బ్బంది మాత్రం పురుగుల అన్నం పెట్టి తమ పైశాచిక నైజాన్ని బయట పెట్టుకున్నారు. ఉదయం పండ్లు ఇచ్చిన వైద్య సిబ్బంది కొద్ది సేపటికే కిచిడిని అల్పాహారంగా అందించారు.
అందులోనూ పురుగులు కనిపించడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎవరూ టిఫిన్ తినకుండా చెత్తబుట్టలో పడేశారు. దీనిపై వెంటనే దవాఖాన సూపరింటెండెంట్ సంపత్కుమార్కు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా చిన్నపిల్లల వార్డు ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. అయితే చావుబతుకుల మధ్య విద్యార్థులు ఉంటే.. వారికి పురుగుల కిచిడి అందించిన వైద్య సిబ్బందిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా దవాఖాన సూపరింటెండెంట్ నిర్లక్ష్యమేనని ఆరోపణలు వస్తున్నాయి.
నిన్న మా పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యాం. దవాఖానలో చికిత్స కోసం వస్తే ఇక్కడ మాకు పురుగుల కిచిడి పెట్టడంతో వాంతులు అయ్యాయి. జిల్లా దవాఖానలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని వస్తే మంచిగా ఆహారం ఇవ్వడం లేదు.
– ప్రియాంక, 9వ విద్యార్థిని, మాగనూర్