గద్వాల, జూన్ 19 : ఎగువన కురుస్తు న్న వర్షాలతో మలప్రభ నదీ పరివాహక ప్రాంతం నుంచి అల్మట్టి ఆనకట్టకు భారీ గా వరద వచ్చి చేరుతున్నది. దీంతో నారాయణపూర్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 75, 000 క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉండడంతో, ఆ నీరు జూరాలకు వచ్చి చే రుతుండడంతో అధికారులు అప్రమత్తమై జూరాల ప్రాజెక్టు నాలుగు గేట్లు తెరిచి దిగువకు 15,516 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 9.657టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.279 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు 38వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చే రుతుంది. విద్యుదుత్పత్తికి 36,415 క్యూ సెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 1500 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-1కు 650 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఇన్‌ఫ్లో 40వేలు క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 52,468 క్యూసెక్కులుగా నమోదైంది.
అయిజ, జూన్ 19 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వానలకు తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతోంది. తుంగ బరాజ్ గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తుండటంతో గురువారం తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 51,654 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 215 క్యూసెక్కులు ఉన్నది.
గరిష్ఠ స్థాయి నీటిమట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1608.23 అడుగుల నీటిమట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 34.221టీఎంసీల నీటి నిల్వ ఉంది. అలాగే కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు వరద స్వల్పంగా చేరుతోంది. ఇన్‌ఫ్లో 834 క్యూసెక్కులు ఉండగా, దిగువన ఉన్న సుంకేసుల బరాజ్‌కు 642క్యూసెక్కులు చేరుతుండగా, ఆర్డీఎస్ ప్రధానకాల్వకు 192 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆర్డీఎస్ ఆనకట్టలో ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 8.2 అడుగుల మేర నీటిమట్టం ఉంది.