ఇటిక్యాల/ఎర్రవల్లి చౌరస్తా/మానవపాడు, సెప్టెంబర్ 25 : జోగుళాంబ గద్వాల జిల్లాలో వర్షం దంచికొట్టింది. రెండ్రోజులుగా కురుస్తున్న వానలకు తోడు నేడు పడడంతో వాగులు, వంక లు పొంగిపొర్లాయి. దీంతో ఆయా గ్రామాల మ ధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికు లు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇటిక్యాల మండల కేంద్రంలోని ఊరచెరువు అలు గు పారడం.. సాతర్ల వాగు ఉధృతంగా పారింది.
అలాగే ఎర్రవల్లి మండలంలో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో నీరంతా పంటపొలాల్లోకి చేరి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గార్లపాడు, షేక్పల్లి, వల్లూరు పెద్ద వాగులు పొంగాయి. అధికారులు స్పందించి వాగులపై బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఇటిక్యాల-మానవపాడు పెద్దవాగు పరిసరాల్లో రాత్రి కురిసిన వర్షంతో పెద్దవాగు ఉప్పొంగింది. మానవపా డు- అమరవాయి, మానవపాడు-గోకులపాడు గ్రామాల మధ్యన ఉన్న వాగు ఉధృతంగా పారా యి. ఆయా గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.