కల్వకుర్తి, డిసెంబర్ 10 : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధి స్వర్ణయుగంలా మారింది. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలలు, కళాశాలలు ముందుకుసాగుతున్నాయి. మెరుగైన విద్య, నాణ్యమై న ఆహారం అందించడమే కాకుండా విద్యేతర అంశాలలో( క్రీడలు, సాంస్కృతిక పోటీలు) గురుకులాలు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఇంటర్ విద్యను అందించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా అత్యధికంగా నిధులు కేటాయించి సకల సౌకర్యాలు కలుగుజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉక్కు సంకల్పంతో గురుకుల పాఠశాలలు/కళాశాలలు సరస్వతీ నిలయాలుగా మారాయి.
ఒకే క్యాంపస్‌లో ఐదు కళాశాలలు
పదో తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో ఇంటర్ విద్యను అందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో గురుకుల జూనియర్ కళాశాలను మంజూరు చేసింది. ఒకేసారి మంజూరు చేసిన గురుకుల జూనియర్ కళాశాలలకు పక్కా భవనాలు ఏర్పాటు చేయడంలో కష్టమైన క్రమంలో ప్రత్యామ్నాయ వసతులపై దృష్టిసారించింది. అందులో భాగంగా పెద్ద పెద్ద భవనాలకు అద్దెకు తీసుకొని గురుకుల కళాశాలలను ప్రారంభించింది. అందులో భాగంగా కల్వకుర్తి పట్టణ సమీపంలోని సీబీఎం కళాశాల భవనాన్ని అధికారులు అద్దెకు తీసుకున్నారు. అం దులో ప్రస్తుతం ఐదు జ్యోతిరావు బీసీ బాలికల గురుకుల కళాశాలలను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా కు సంబంధించి కల్వకుర్తి, హన్వాడ, వెల్టూరు, ఊర్కొండ, భూత్పూర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సు) మండలాలకు చెందిన జ్యోతిరావు బీసీ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలు కల్వకుర్తి సీబీఎం కళాశాలో కొనసాగుతున్నాయి.
960 మంది విద్యార్థినులు
ఒకే క్యాంపస్‌లో 960 మంది విద్యార్థినులు ఇంటర్ విద్యను అభ్యసిస్తున్నారు. మినీ విశ్వవిద్యాలయాన్ని తలపిస్తున్న ఈ క్యాంపస్‌లో పూర్తి స్థాయిలో వసతులు ఉండటం ప్రత్యేకమైన అంశం. విశాలమైన వంట గదులు, డైనింగ్‌హాల్‌తో పాటు అవసరమైన తరగతి గదులు, వసతి గదులు ఉన్నాయి. ఆటలకు ప్రత్యేకంగా మైదానం, సాంస్కృతిక కార్యక్రమాలకు ఆడిటోరియాలు ఉన్నాయి. విద్యార్థినుల సౌ లభ్యం కోసం ఉన్న ఈ భవనాలకు రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.8లక్షల 10వేలు అద్దె చెల్లిస్తుంది.
ప్రిన్సిపాల్‌తోపాటు 30మంది అధ్యాపకులు
ఐదు కళాశాలకు ఒకే ప్రిన్సిపాల్ ఉండగా 30మంది అధ్యాపకులు పనిచేస్తున్నారు. విద్యార్థులకు వైద్యం కోసం తాత్కాలిక పద్ధతిపై ఒక స్టాప్ నర్స్ పనిచేస్తున్నారు. 10మంది అధ్యాపకులు( మహిళలు) విద్యార్థినులతో పాటు గురుకులంలోనే ఉంటారు. ఉదయం, రాత్రి వేళల్లో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తారు. ఇందుకోసం వంతుల వారిగా అధ్యాపకులు విధులు నిర్వహిస్తారు.
ఉదయం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు..
ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బోధన, బోధనేతర కార్యక్రమాలు ఉంటాయి. ఆదివారం మినహా మిగతా రోజుల్లో విద్య, విద్యేతర అంశాలలో విద్యార్థినులకు నిరంతర బోధన సాగుతుంది. ఉదయం 5 గంటలకు విద్యార్థినులు అంతా మైదానంలోకి చేరుకుంటారు. అక్కడ యోగా, వ్యాయామాలు ఉంటాయి. సంస్కృతీ సంప్రదాయలకు సంబంధించిన ఆధ్యాత్మిక ప్రవచనాలను విద్యార్థినులకు వినిపిస్తారు. ఇందుకు సంబంధించి కొందరు అధ్యాపకులు బ్రహ్మకుమారీస్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ కార్యక్రమం వల్ల విద్యార్థినులు మానసికంగా ధృడంగా తయారవుతారని ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు తెలిపారు. సాయంత్రం వరకు తరగతులు. అనంతరం విద్యార్థినుల ఆసక్తిని బట్టి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రావీణ్యత సాధించే శిక్షణ ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత 10గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి.
నాణ్యమైన ఆహారంతో కూడిన మెనూ
విద్యార్థినులకు నాణ్యమైన ఆహారంతో కూడిన మెనూ ఉంటుంది. ఉదయం రాగిజావా, లేదా బూస్ట్. వీటికి తోడు గా బలవర్థకమైన నట్స్ ఇస్తారు. టిఫిన్ ప్రతి రోజూ ఒక వెరైటీ ఉంటుంది. ఉప్మా, పులిహోర, జీరా రైస్, ఇడ్లి, చపాతి ఉంటుంది. మధ్యాహ్నం అన్నం, కూరగాయలతో కూర, ప ప్పు, రసం, మజ్జిగ,గుడ్డు ఇస్తారు. రాత్రి అన్నం, చట్నీ, పప్పు, సాంబార్ అరటిపండు ఇస్తారు. రోజూ సాయంత్రం చిరుధాన్యాలతో తయారు చేసిన బిస్కెట్లు ఇస్తారు. ప్రతి నెలలో మూడుసార్లు చికెన్, రెండు సార్లు మటన్ ప్రతి విద్యార్థికి 100 గ్రాముల చొప్పున ఇస్తారు.
చక్కగా చదువుకుంటున్నాం
కళాశాలలో చక్కగా చదువుకుంటున్నాం.ఊరికి వెళ్లాలన్నా ధ్యాసే ఉండదు. ప్రిన్సిపాల్, అధ్యాపకులు మమ్మల్ని సొంత పిల్లలా చూసుకుంటారు. ఐదో తరగతి నుంచి జ్యోతిరావు బీసీ గురుకుల పాఠశాలల్లోనే చదువుకుంటున్నాను. ఇది నాకు ఇళ్లు లాగే అనిపిస్తుంది. చదువులో, భోజనంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలాంటి కళాశాలలు ఏర్పాటు చేసి మెరుగైన విద్యను అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
– తేజస్వీని, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, హెచ్ఈసీ
నాయకత్వ లక్షణాలు పెంపు
నాకు నలుగురిలో మా ట్లాడాలంటే చాలా సిగ్గు. అ లాంటిది ఈ కళాశాలలో చేరాక..స్టేజీ ఎక్కి సులువుగా మాట్లాడగలుగుతున్నాను. ప్రతి రోజూ సాయంత్రం ఏదో ఒక అంశంపై చర్చ ఉం టుంది. చర్చపై చక్క గా మాట్లాడగలుగుతున్నారు. బోధనలో ఎలాంటి సమస్యలేదు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు మా తో స్నేహితుల్లా వ్యవహరిస్తారు. ఇక్కడ చదువుకోవడం చాల ఆనందంగా ఉంది.
-నవ్యశ్రీ, ఇంటర్ మొదటి సంవత్సరం, సీఈసీ
గురుకులాలు విద్యార్థుల పాలిట దేవాలయాలు
గురుకులాలు విద్యార్థుల పాలిట దేవాలయాలు. డబ్బున్న వాళ్ళు ఎక్కడైనా చదువుకుంటారు. పేద విద్యార్థులకు మెరుగైన చదువు అందించాలనే ఉద్ధేశంతో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తుంది. క్యాంపస్‌లో ఉన్న 960మంది విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధతీసుకుంటాం. విద్యార్థుల ఆసక్తిని బట్టి కరికులం, కోకరికులం యాక్టివిటీస్ ఉంటాయి. విషయాంశాల ప్రకారం బోధన, మెనూ ప్రకారం భోజనం ఉం టుంది. ఆటలకు కూడా చాల ప్రాధాన్యం ఇస్తాం. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా తమ విద్యా కార్యాచరణ ఉంటుంది.
– వెంకటేశ్వర్రావు, ప్రిన్సిపాల్, మహాత్మాజ్యోతీరావు ఫూలే కళాశాల, కల్వకుర్తి