బ్రహ్మగిరి (దోమలపెంట), జూలై 19 : నిబంధనలకు విరుద్ధంగా చేపల వేట కొనసాగుతున్నది. శ్రీశైలం డ్యాంకు అతి సమీపంలో.. టీజీజెన్కోకు సంబంధించిన నిషేధిత స్థలంలో వేట జోరందుకున్నది. మెట్ల ద్వారా నదిలోకి ప్రవేశించి ఆంధ్రా, తెలంగాణ మత్స్యకారులు యథేచ్ఛగా చేపలు పడుతున్నారు. దీంతో అక్కడికే దళారులు చేరుకొని చేపలు కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో నిత్యం దందా ‘మూడు పువ్వులు-ఆరు కాయలు’గా విరాజిల్లుతున్నది.
నిత్యం 200 క్వింటాళ్ల వరకు రవాణా
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఐదురోజుల కిందట అధికారులు మూసివేశారు. దీంతో ఆంధ్రా-తెలంగాణ మత్స్యకారులు విచ్చలవిడిగా.. నిబంధనలకు విరుద్ధంగా.. డ్యాం ముందు భాగంలో.. ప్రమాదకరంగా చేపల వేట జోరుగా సాగిస్తున్నారు. నిత్యం 200 వరకు తెప్పలపై 400మంది జాలర్లు నదిలోకి వెళ్లి సాహసో పేతంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. దాదాపు 200 క్వింటాళ్ల వరకు చేపలు పడుతుండగా.. దళారులు మెట్ల మార్గం మీదుగా అక్కడకు చేరుకొని కొనుగోలు చేస్తున్నారు.
అనంతరం హైదరాబాద్, కర్నూల్తోపాటు పలు ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. కాగా అటు జంతువులకు, ఇటు చేపలకు సంతాన ఉత్పత్తి సమయం. అందుకే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ (ఏటీఆర్ఎఫ్)లో జూలై నుంచి సెప్టెంబర్ చివరి వరకు మూడు నెలలు నల్లమలలోకి నో ఎంట్రీ ఉండగా.. చేపల వేటను సైతం నిషేధించారు. ముఖ్యంగా శ్రీశైలం డ్యాం ముందు భాగం నుంచి ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రం ఎగ్జిట్ వరకు చేపల వేటను అనుమతించరు. అయినా రెండు రాష్ర్టాలకు చెందిన మత్స్యకారులు తెప్పలు వేసుకొని విచ్చలవిడిగా వలలు వేసి చేపలు పడుతున్నారు.
చేపల కోసం ఘర్షణలు సైతం
శ్రీశైలం డ్యాం గేట్ల వద్ద నీటిలో చేపల వేటను జోరుగా కొనసాగిస్తున్నారు. అయితే రెండ్రోజుల కిందట మత్స్యకారుల రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఓ చేప తమదేనంటే.. తమదంటూ.. ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఆగ్రహంతో తెప్పల తెడ్లతో కొట్టుకున్నారు. అసలు చేపల వేటే నిషేధం.. అలాంటిది టీజీజెన్కో నిషేధిత స్థలంలో ఏకంగా దళారులు చేపల ఎగుమతి కేంద్రాన్ని అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు.
ఇంతా జరుగుతున్నా రెండు రాష్ర్టాలకు చెందిన అటవీ, జెన్కో, ఫిషరీస్ అధికారులు ఏం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చేపల వేట కొనసాగిస్తూ రూ.లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నా.. అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో జోగుతున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. కాగా ప్రస్తుతం శ్రీశైలం డ్యాం నిండుకుండ ను తలపిస్తుండగా.. మరో 24 గంటల్లో ఎప్పుడైనా గేట్లు తెరిచే అవకాశం ఉన్నది. ఇలాంటి సమయంలో చేపల వేట కొనసా గకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నది.
ఎలాంటి అనుమతుల్లేవు
టీజీజెన్కో నిషేధిత స్థలమైన శ్రీశైలం డ్యాం గేట్ల దిగువ ప్రాంతంలో చేపలు పట్టడం నిషేధం.. అక్కడ మత్స్యకారులు చేపలు పట్టడంతోపాటు అక్కడే దళారులు కొనుగోలు చేసి ఎగుమతి చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి రాలేదు. డ్యాం పరిసరాల్లో ప్రస్తుతం ప్రొహిబిషన్ ఏరియా.. అక్కడ ఎవరికీ అనుమతి లేదు. ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం.. ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణ కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటాం..
– కేవీవీ సత్యనారాయణ, సీఈ, ఎడమ గట్టు జలవిద్యుత్కేంద్రం