దివిటిపల్లి వద్ద ఏర్పాటు చేయనున్న లిథియం గిగా సెల్ పరిశ్రమతో పాలమూరు దశ మారుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఐటీ టవర్ పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. అక్కడ ఏర్పాటు చేయనున్న లిథియం కంపెనీ దేశంలోనే మొట్టమొదటిదన్నారు. ఈ కంపెనీ ప్రారంభమైతే పదివేల మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ- వాహనాల వల్ల వాహన కాలుష్యాన్ని అరికట్టవచ్చన్నారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న పరిశ్రమను ఏర్పాటు చేయకుండా కొందరు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరించారు. ఈ ప్రాంతానికి నిజంగా అన్యాయం జరిగే పరిస్థితి వస్తే తామే ముందుకువచ్చి పోరాడుతామన్నారు.
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రపంచవ్యాప్తంగా వెలువెత్తుతున్న వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు మహబూబ్‌నగర్ అర్బన్ మండలం దివిటిపల్లి వద్ద ఉన్న ఐటీ పార్కులో అమర్‌రాజా సంస్థ ఏర్పాటు చేయనున్న లిథియం గిగా సెల్ కంపెనీ దేశంలోనే మొట్టమొదటిదని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎదిరలో ఈద్గా పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రూ.10వేల కోట్లతో ఏర్పాటు చేస్తున్న బ్యాటరీ కంపెనీ వల్ల పది వేల మందికి ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీ టవర్ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. ఎదిర, దివిటిపల్లి సమీపంలో ఇప్పటికే ఐటీ పార్కు నిర్మాణం పూర్తి కావచ్చిందన్నారు. లిథియం గిగా కంపెనీ ఏర్పాటుతో పాలమూరు జిల్లా దశ మారనున్నదన్నారు. గతంలో జిల్లా నుంచి బతుకుదెరువు కోసం 14 లక్షల మంది వలసలు వెళ్లే పరిస్థితి ఉండేదని, ఈ ఫ్యాక్టరీ ఏర్పాటుతో వలస వెళ్లిన వారు తిరిగి రావడమే కాకుండా స్థానికంగా అనేకమందికి భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
కశ్మీర్లో ఇటీవల కనుగొన్న లిథియం నిల్వలపై ప్రపంచమంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నదన్నారు. ఎలక్రిక్టల్ వాహనాలకు అవసరమైన బ్యాటరీలకు లిథియం గుండెకాయ లాంటిదని తెలిపారు. ఈ-వాహనాల వల్ల ప్రపంచంలోని వాహన కాలుష్యాన్ని తరిమికొట్టే అవకాశం ఉందన్నారు. బ్యాటరీ కంపెనీలో తయారయ్యే లిథియం గిగా సెల్‌లపై అందరి దృష్టి ఉందన్నారు. మేధావులు, విద్యావంతులు, యువత ఆలోచించి పరిశ్రమ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఈ పరిశ్రమపై కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారు. వారి కుట్రలను ఇక సాగనివ్వబోమన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేస్తున్న పరిశ్రమను అడ్డుకుంటే ద్రోహులుగా మిగిలిపోతారని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎదిర ఏరి పారేసినట్లుండేదని, తాగునీటికి కూడా కటకటలాడే పరిస్థితి ఉండేదని మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశామన్నారు. ఐటీ పార్కు, బ్యాటరీ కంపెనీ ఏర్పాటైతే ఇండ్లు, భూములు, స్థలాల ధరలు ఊహించని విధంగా పెరుగుతున్నాయన్నారు. ఎదిర, దివిటిపల్లి, అంబటిపల్లి గ్రామాలతోపాటు జిల్లా మొత్తం అభివృద్ధి చెందుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, కౌన్సిలర్ యాదమ్మ, నాయకులు హనుమంతు, ఎల్లయ్య, శేఖర్, రాములు, హకీం, అజీజుల్లా తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని హిమాలయ కన్వెన్షన్ సెంటర్లో ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు కేంద్రం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదన్నారు. అన్ని రాష్ర్టాల మాదిరిగా తెలంగాణను చూడడం లేదని విమర్శించారు. సాయం చేయకుండా వేధింపులకు గురిచేస్తున్నదన్నారు. మన పన్నులకు ఇతర రాష్ర్టాలకు మళ్లించి మనకు రిక్తహస్తం చూపిస్తున్నదన్నారు. వెనుకబడిన జిల్లాలో కరువును పారదోలేందుకు నిర్మింస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నదన్నారు. కేంద్రం నయాపైసా కూడా ఇవ్వడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి జరిగిందో ట్యాక్స్ ప్రాక్టీషనర్లకు ప్రత్యేక్షంగా చెప్పనవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చారన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు దేశంలో హైదరాబాద్ అనుకూలంగా ఉందన్నారు. రేషన్ బియ్యం కోసం ఒకప్పుడు పంజాబ్ వైపు చూసేవారమని.., నేడు ఎఫ్సీఐకు సరఫరా చేసే బియ్యంలో 60శాతం తెలంగాణ నుంచే వెళ్తుండడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్, తెలంగాణ టాక్స్ ప్రాక్టీషనర్స్ అధ్యక్షుడు నగేష్ రంగి, ప్రధాన సలహాదారు పీవీ సుబ్బారావు, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.