నారాయణపేట రూరల్, నవంబర్ 28 : నారాయణపేట మండలం లింగంపల్లి శివారులోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్లులో గురువారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆకస్మాత్తుగా సీసీఐ ద్వారా కొనుగోలు చేసిన పత్తి తగలబడుతుండటంతో అక్కడున్న వారు అర్పేందుకు ప్రయత్నించారు. వెంటనే యజమాని శ్రీనివాస్ లాహోటి ఫైర్ అధికారులకు స మాచారం అందించగా, జిల్లా ఫైర్ ఆఫీసర్ సురేశ్‌రెడ్డి, ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ రమేశ్‌రెడ్డి సిబ్బందితో మంటలు అర్పేందుకు ప్రయత్నించారు.
పత్తి ఎక్కువ మొత్తంతో తగలబడుతుండటంతో అధికారులు మక్తల్, కొత్తకో ట, ఆత్మకూర్ నుంచి ఫైర్ ఇంజన్లను తెప్పించి మంటలను ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. మిల్లును డీఎస్పీ లింగయ్య, రూరల్ ఎస్సై రాముడు పరిశీలించి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. షార్ట్‌సర్క్యూట్ వల్ల జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు. సీసీఐ అధికారులు కూడా అక్కడికి చేరుకొని సంఘటనపై ఆరా తీసినట్లు సమాచారం. పత్తి సుమారుగా 10వేల క్వింటాళ్లు ఉండవచ్చునని, రూ.6కోట్ల విలువ ఉంటుందని అంచనా. అధికారులు,పోలీసులు విచారణ పూర్తి చేశాక పత్తి నష్టం విలువ తెలవనుంది.