జడ్చర్లటౌన్, జూన్ 9 : కులవృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ఆర్థికసాయం అందించి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీసీల్లోని వృత్తికులాల్లో ప్రతి కుటుంబానికి రూ.లక్ష ఆర్థికసాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీ వృత్తి కులాలకు చెందిన వారు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకోగా జడ్చర్ల నియోజకవర్గంలో మొదటగా ఇద్దరికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం మంజూరైంది. శుక్రవారం జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి లబ్ధిదారులకు ఆర్థికసాయం చెక్కులను అందజేశారు. కులవృత్తిపై ఆధారపడిన తమకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సీఎం కేసీఆర్ రూ.లక్ష ఆర్థికసాయం అందించి తమ జీవితాల్లో వెలుగులు నింపారని లబ్ధిదారులు పేర్కొన్నారు.
కుటుంబానికి ఆధారమవుతుంది
మా కుటుంబ సభ్యులంతా నాయీబ్రహ్మణ(మంగలి)వృత్తిపై ఆధారపడ్డాం. నా తండ్రి హన్మంతు మంగళి పనిచేసేవాడు. 2007లో చనిపోయాడు. మా అమ్మ అనసూయ ఇంటి వద్దే ఉంటుంది. మేము ఐదుగురు అన్నదమ్ములం, ఇద్దరు అక్కలు ఉన్నారు. అందరం వేర్వేరుగా జీవిస్తున్నాం. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు భూసేకరణలో మూడున్నర ఎకరాల భూమి పోయింది. గ్రామంలో ఇల్లు ఒక్కటే ఉంది. పదోతరగతి వరకు చదువుకున్నా.. కుల వృత్తిని వదిలిపెట్టొద్దని ఇదే పనిలో కొనసాగుతు న్నా.. వల్లూర్లో ఓ షాపును కిరాయికి తీసుకొని నడుపుకొంటున్నాను. రోజుకు రూ.500 సంపాదిస్తా.. కులవృత్తిపై ఆధారపడిన వారికి రూ.లక్ష ఆర్థికసాయం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ సార్ ప్రకటించిన విషయం తెలుసుకొని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా.. వెంటనే రూ.లక్ష మంజూరైంది. సీఎం సార్ ఇచ్చిన రూ.లక్షతో షాపులో కుర్చీలు, అద్దాలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేసుకుంటాను. సీఎం సార్ నాయీబ్రహ్మణులకు ఎంతో మేలు చేస్తున్నారు. ఇప్పటికే ఉచిత కరెంటు ఇచ్చి ఆదుకోగా.. ఇప్పుడు రూ.లక్ష ఆర్థిక సాయం చేసి మా జీవితాలకు వెలుగునిస్తున్నారు. ఇదే రూ.లక్ష బయట అప్పు తెస్తే అసలుతోపాటు వడ్డీ కట్టా ల్సి వచ్చేది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.. చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్కు రుణపడి ఉంటాను.
కూలిన బట్టీని బాగు చేసుకుంటా
మాది రాజాపూర్ మండలం కుచ్చరికల్ గ్రామం. ఇంటి వద్దే మా కుటుంబమంతా కుమ్మరి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఇటీవల వర్షానికి బట్టీ కూలిపోయింది. బట్టీ కట్టుకోవాలంటే డబ్బులు అవసరం. దీని కోసమే ఆలోచిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ కుల వృత్తి వారికి రూ.లక్ష ఆర్థిక సా యం అందిస్తామని ప్రకటించారు. వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా.. వెంటనే అధికారులు రూ.లక్ష మంజూరు చేశారు. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతుల మీదుగా రూ.లక్ష చెక్కును తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉంది. కులవృత్తి వారికి రూ.లక్ష ఆర్థికసాయం మా లాంటి వారికి ఎంతో ఉపయోగపడతుంది. మమ్మల్ని ఆర్థికంగా ఆదుకున్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సార్లను ఎన్నటికీ మరవను.
– మణిందర్, కుచ్చర్కల్, రాజాపూర్ మండలం