ఊట్కూర్ : యువత సామ్రాజ్యవాద విష సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడాలని పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దు (PYL Secretary Siddu ) పిలుపునిచ్చారు. షహీద్ భగత్ సింగ్ ( Bhagat Singh ) 118 వ జయంతి సందర్భంగా ఆదివారం నారాయణపేట జిల్లా బిజ్వార్ గ్రామంలో పీవైఎల్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘం నేతలు, యువకులు గ్రామ పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటుచేసిన భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దు మాట్లాడుతూ.. భారతదేశ స్వాతంత్రం కోసం ఉరి కొయ్యలను ముద్దాడిన, నూనూగు మీసాల ప్రాయంలో దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మత రాజకీయాలు, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ సబ్ డివిజన్ నాయకులు సలీం, రైతు సంఘం నాయకులు పోర్ల నరసింహులు, ఎల్ గోవిందు, నర్సింలు, పరుశురాం, టి వెంకటేష్, ఎల్లప్ప, గోవర్ధన్ రెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.