పాలమూరు, జూన్ 24 : త్వరలో పాలమూరు-రంగరెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తి చేసి కోటకదిర సహా ఈ ప్రాంతంలోని ప్రతి ఎకరాకూ పుష్కలంగా సాగునీటిని అందిస్తామని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. వేసవిలోనూ సాగునీటి సవ్వడులు వినిపించేలా చేస్తామని పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ మండలం కోటకదిర గ్రామంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహాల ప్రతిష్ఠాపన, బొడ్రాయి పున:ప్రతిష్ఠాపనోత్సవాలకు మంత్రి సతీసమేతంగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి దంపతులకు ఊరి పొలిమేర వద్దకు గ్రామస్తులు ఊగేరింపుగా చేరుకొని స్వాగతం పలికారు. అనంతరం వారు కోట మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి బోనాలతో బొడ్రాయి వరకు సాగిన ఊరేగింపులో మంత్రి దంపతులు పాల్గొన్నారు. బొడ్రాయి ప్రతిష్ఠాపన అనంతరం రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసి చిన్నారులతో కలిసి అడుగుల భజనలో పాల్గొన్నారు. అనంతరం గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామస్తులతో మాట్లాడారు. ఒకప్పుడు గ్రామంలో ఉపాధి అవకాశాలు లేక చాలామంది వలసలు వెళ్లేవారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత వలసలు వాపస్ వచ్చి గ్రామాలు కళకళలాడుతున్నాయన్నారు. తాగునీటికి ఇబ్బందులు పడిన పరిస్థితికి చెక్ పెడుతూ నేడు శ్రీశైలం నుంచి కృష్ణానదిని తీసుకొచ్చి శుద్ధజలాన్ని అందిస్తున్నామన్నారు.
మన్యంకొండ ఆలయం వద్ద ఒకప్పుడు కనీస వసతులు ఉండేవి కాదని.. ఇప్పుడు అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. మౌలిక వసతులు అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం వల్ల భూముల విలువలు అమాంతం పెరిగాయన్నారు. కుల, మతాలకు అతీతంగా సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. అభివృద్ధి నిరోధకులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, సర్పంచ్ రమ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింహులు, మండల కోఆప్షన్ సభ్యుడు మస్తాన్, మన్యంకొండ ఆలయ ట్రస్ట్ సభ్యుడు రాజేందర్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
కార్యకర్తకు అండగా నిలిచిన మంత్రి
ఆపదలో ఉన్న కార్యకర్త కుటుంబానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అండగా నిలిచారు. మహబూబూబ్‌నగర్ రూరల్ మండలానికి చెందిన పెద్దబాయి కుర్మయ్యకు ఇన్ఫెక్షన్ కారణంగా కాలును తొలగించారు. ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్న విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న మంత్రి రూ.50వేలు ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.