అలంపూర్ చౌరస్తా, మే 2 : ఉండవెల్లి మండలం ప్రాగటూరులో 18 గడ్డివాములు అంటుకొని రూ.27లక్షలకు పైగా ఆస్తినష్టం సంభవించింది. గ్రామస్తులు, బాధితుల కథనం ప్రకారం.. ప్రాగటూర్కు చెందిన 12 మంది రైతులు గ్రామంలోని కల్లాల్లో పక్కపక్కనే పశువుల మేత కోసం 18గడ్డివాములు ఏర్పాటు చేసుకున్నారు. గురువారం అర్ధరాత్రి ఓ మహిళ ఇంట్లో నుంచి బహిర్భూమికి వెళ్లగా, గడ్డివాముల వద్ద మంటలు కనిపించాయి. దీంతో మహిళ గట్టిగా కేకలు పెట్టగా చుట్టుపక్కల వారు ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఫైర్స్టేషన్కు సమాచారమిచ్చారు. వారు వచ్చి మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది.
అప్పటి కే గడ్డివాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. 18 గడ్డివాము లు, పైపులు, ఎద్దుల బండ్లు, వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు ఉండే గుడిసెలు ఇలా రైతులకు సంబంధించిన పరికరాలు కాలిపోయాయి. సమాచారం తెలుసుకున్న తా సీల్దార్ ప్రభాకర్ రెవెన్యూ సిబ్బందితో కలిసి శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దాదాపు రూ.27,82, 200ల ఆస్తినష్టం వాటిల్లిందని అంచనా వేశారు. ఈ మేర కు ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే గుర్తుతెలియని దుండగులు గడ్డివాములకు నిప్పుపెట్టారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.